పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0240-6 బౌళి సంపుటం: 08-240

పల్లవి:

కప్పురమిచ్చితే నీకుఁ గారమాయనా
యిప్పుడు నీభాగ్యానకు నేమిసేసునే

చ. 1:

చెలిమిచేసేవేళ చెక్కునొక్కి వేఁడుకొంటే
అలిగి విభుఁనిఁ దిట్టే వదేమె నీవు
కొలఁదిమీరి తప్పి కొనగోరు దాఁకితేను
యెలమి నింతలో నితఁడేమి సేసునే

చ. 2:

చేరి బుద్దిచెప్పేవేళ చెవిలో మాటాడితేను
ఆరయఁ దప్పక చూచే వదేమె నీవు
మారులేక అవియె నీమర్మములు సోఁకితేను
యీరీతి నింకా నితఁడేమి నేసునె

చ. 3:

మోవితేనె విందువేళ మొనపల్లు సోఁకితేను
ఆవల చూచి నవ్వేవు అదేమె నీవు
నీవె అలమేల్మంగవు నిన్నేలె శ్రీవెంకటేశుఁ
డీవేళను ఆయ నాతఁడేమి సేసునే