పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0241-1 సామంతం సంపుటం: 08-241

పల్లవి:

వింత లాపెవద్దనుండి వినీఁ గాని
యింతయు మాతో నానతియ్యవయ్య నీవు

చ. 1:

చెప్పినట్టె సేసి తెలిసిగ్గువడి వున్నదింతె
అప్పుడె మెచ్చెఁజుమ్మీ ఆపె నిన్ను
కుప్పరగంధి మతిలోఁగలమాట నేమాడేము
చెప్పేమాటలు మాతోనె చెప్పవయ్య నీవు

చ. 2:

మన్నించితి వన్నిటాను మనసు వచ్చెవున్నది
కన్నులనె మొక్కెఁజుమ్మీ కాంతనీకు
సన్నలు సేసినమోల్లా సరినేము దెలిపేము
యిన్నియు మాకుత్తరము లియ్యవయ్య నీవు

చ. 3:

కాఁగిటఁ గూడితి విదె కైకొనె నలమెల్‌‌మంగ
ఆఁగి వురమెక్కెఁజుమ్మీ ఆపె నిన్నంటి
వీఁగము శ్రీవెంకటేశ విన్నవించే మిఁక నీతో
పోఁగు వోఁగుఁ బొంద మమ్ముఁ బొందించుమీనీవు