పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0239-6 నాదరామక్రియ సంపుటం: 08-234

పల్లవి:

నిచ్చలు సేవలుసేసి నేనే వేసరితి
అచ్చలానఁ దనకంటే అలసితిని

చ. 1:

కన్నుల కాఁకలుదీర కప్పురము చరమవే
యెన్నిక నెవ్వతెకో యెదురుచూచె
సన్నలుచేసిన చేయి సకియరో పిసుకవే
పన్ని సారె వంచి వంచి బడలినాఁడు

చ. 2:

పెదవికిఁ బదనురాఁ బిలిచి పన్నీరీవే
కదిసి యెవ్వతెకో కతలు చెప్పె
పొదిగినమేనఁ దట్టుపునుఁగయినాఁ బూయవే
మదనగరిడి సదమదమైనాఁడు

చ. 3:

వురముమీఁదికి నిట్టె వుపచారాలు సేయవే
మొరసి చన్ను మోపు మోఁచినాఁడు
యిరవై శ్రీవెంకటేశుఁ డెననె నాకాఁగిట
మరిగించి నన్నిట్లా మన్నించినాఁడు