పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0240-1 దేశా(సా)క్షి సంపుటం: 08-235

పల్లవి:

కానీవయ్య దానికేమి కర్తవు నీవు
తానకమైతిమి యింకా దండనుండేమయ్యా

చ. 1:

చతురుఁడ వన్నిటాను సముకాన నున్నదాన
రతికిఁ బిలువవంటా రవ్వసేసేనా
గతి నీమో మాకు మరి కాఁతాళించి సేసేదేమి
తతివచ్చినందాఁక దండనుండేమయ్యా

చ. 2:

నేరుపరి వన్నిటాను నీకుఁ గట్టితి నేఁ దాళి
చేర మాటాడకున్నాఁ జెచ్చెరఁ దిట్టేనా
కోరినకోరిక నీవు గుంపించి సేసేదేమి
తారుకాణైనదాఁకా నీదండనుండేమయ్యా

చ. 3:

బలువుఁడ వన్నిటాను పట్టితి వ్రతము నీకు
అలయఁ గూడితి విఁక నౌఁగాదనేనా
యిల శ్రీ వెంకటేశుఁడ మెప్పుడూఁ జేసేదేమి
తలఁపు నిలుపు దాఁకా దండనుండేమయ్యా