పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0238-3 కన్నడగౌళ సంపుటం: 08-225

పల్లవి:

మంచివాఁడె నావిభుఁడు మగువలాల
వంచుకోవలసి తానె వలపంచెఁగాకా

చ. 1:

మొగముచూచినవాఁడు మొదలఁ దానె కదవె
నగవురాఁగా వెనక నవ్వితిఁగాని
యెగసక్యపుదానవా యిందరు నెరఁగకుండ
అగడు సేయవలసి అనీనింతెకాకా

చ. 2:

కాఁగిలించుకొన్నవాఁడు గట్టిగఁ దానె కదవె
పాఁగిన మచ్చాలు మరి పట్టితిఁగాని
రాఁగతనముదాననా రాసికెక్కిన్నాళ్లాయ
వేఁగుసేసి మోచిదించ వింతసేసీఁగాకా

చ. 3:

చేరి కూడినట్టివాఁడు శ్రీవెంకటేశుఁడె కదె
ఆరయ నేనిపుడు నంటితిఁగాని
బీరములదాననా పెడ్లి నేఁడెఆయ
సారెసారెవేఁడుకొంటా చనవిచ్చీఁగాక