పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0238-2 పాడి సంపుటం: 08-224

పల్లవి:

వట్టి వలపులుచల్లి వనితలఁ గొసరేవు
పట్టకు నీవంతేసి బలిమేల వొట్టేవు

చ. 1:

చిక్కని తేనెలవంటి చెలియమాటలె నీకు
చెక్కుచేతి చింతలకు జిగురైయంటె
యెక్కడ నెవ్వతెయైనా నేల నీమనసు వచ్చీ
చక్క నూరకుండవయ్య సటలేల సేసేవు

చ. 2:

పల్లెతాడువంటి వనితచూపులు నీకు
వుల్లముకోరికలకు నురులైనిల్చె
యెల్లకాంతలుండినాను యేల నీవు మెచ్చేవు
బెల్లించకువయ్య లేనిప్రియాలేల చెప్పేవు

చ. 3:

కందువ చక్కెరవంటి కాంతకెమ్మోవి నీకు
మందులై నీకాఁగిటికి మరులుగొల్పె
యిందరి శ్రీవెంకటేశ యిటు నన్నూఁగూడితివి
చందాలు సేయకువయ్య చవులేల చూపేవు