పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0237-2 ముఖారి సంపుటం: 08-218

పల్లవి:

కప్పురవిడెమియ్యఁగాఁ గాదనరాదు
తప్పులేదు నీయందు తగిలితి నిన్నును

చ. 1:

చెచ్చెర నీవు చేసినచేఁతలు వింటి నీవిందు
వచ్చెనని చెప్పగా వద్దనరాదు
యిచ్చకములాడేవారి నిటు రమ్మందురుగాన
విచ్చేయుమా యింటికిట్టె వింటిమి నీమాఁటలు

చ. 2:

చెంగట నీసతిఁగంటి సిగ్గువడి అంతలో నా
కొంగువట్టగా నిన్నుఁ గోపించరాదు
ముంగిట వేఁడుకొంటేను మొగమోడుదురుగాన
అంగవించె రావయ్య అలుకలు దేరెను

చ. 3:

యెంచుకొంటి నీగుణాలు యిందరఁజూడఁగా నా
కంచముపొత్తుకు రాఁగాఁ గాదనరాదు
అంచెల శ్రీవెంకటేశ అట్టె నన్నేలితిగాన
యించుకించుకె నవ్వెను యియ్యకొంటిసుద్దులు