పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0236-2 శ్రీరాగం సంపుటం: 08-212

పల్లవి:

మిక్కుటపు సరసాలు మించి మొగచాటయ్యా
దక్కినట్టి కాఁపురానఁ దనిసివున్నారము

చ. 1:

కొలువుపతిమెలెల్లా గోడచేరువులెకాక
కలయిక రతులకుఁ గారణమేమి
వల దేల గొంగువట్టీ వద్దనరే రమణుని
తలఁగక కన్నులనే తనిసివున్నారము

చ. 2:

తోడునీడ సతులెల్లా తోలుబొమ్మలెకాక
వేడుక కూటములకు వెలవెట్టేరా
చూడకు మనరె వొత్తి సొలపులనాయకుని
తాడుపడ్డ ఆసలనే తనిసివున్నారాము

చ. 3:

సిగ్గుపడ్డ కాంతలెల్లా చిత్తరురూపులెకాక
దగ్గరి చేతఁలు సేయ దమయాటలా
అగ్గమై శ్రీ వెంకటేశు నన్నిటా మీరుమెచ్చరే
తగ్గక నేఁడిట్టెకూడె తనిసివున్నారము