పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0235-1 బౌళిరామక్రియ సంపుటం: 08-205

పల్లవి:

కూరిమి సిగ్గులు తెగీ కొంకనేఁటికి
యేరీతికైనా నీవు యియ్యకొనవయ్యా

చ. 1:

పట్టినదే వ్రతము పడఁతులకుఁ జలము
అట్టె పతులకుఁ జేయకపోరాదు
ఱట్టడి యాపె మోవిచూఱలకు నాసపడేవు
యెట్లైనఁ జేయనీ నీవియ్యకొనవయ్యా

చ. 2:

ఆడినదేమాటా అంగనలు పంతమున
నాడోడికయినా వినకపోరాదు
తోడనే మేలుది యాపె తొలఁగలేవు నీవు
యేడసుద్దికైనా నీవియ్యకొనవయ్యా

చ. 3:

తలఁచినదె పొద్దు తరుణుల కాఁగిటికి
వలపులు ముదిరెను వద్దనరాదు
బలువాపెది శ్రీ వెంకటపతివి నిన్నుఁ గూడె
యెలమి నన్నిటికి నీవియ్యకొనవయ్యా