పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0234-6 భైరవి సంపుటం: 08-204

పల్లవి:

సంగతి గానిపనికి సాకిరున్నారా
అంగవించి విడెమీఁగా నదేమంటిఁగాక

చ. 1:

సమ్మతించినమాటకు జగడములున్నావా
దొమ్మిసేసి యంటఁగానె దూరేఁగాక
యిమ్ముల నేరమంటే యిప్పుడే లేదనేనా
అమ్మరో యిల్లుచొరఁగా నదేమంటిఁగాక

చ. 2:

చుట్టరికము గలితే సూడువట్ట వచ్చేనా
వెట్టికఁ బైకొనఁగాను వేసరేఁగాక
గట్టిగానె నవ్వితేను కాదని తొలఁగేనా
అట్టె సందుకొనగాను అదేమంటిఁగాక

చ. 3:

తొలుతనె చెప్పితేను తొలమని తోసేనా
బలిమిఁ బెనఁగఁగాను పదరేఁగాక
యెలిమి శ్రీ వెంకటేశుఁ డిన్నిటా నన్నుఁగూడెను
అలయించఁగా రతుల నదేమంటిఁగాక