పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0234-5 మాళవిగౌళ సంపుటం: 08-203

పల్లవి:

ఇంక నెంతగాఁగలదో యింతివల్ల నీకు
సంకుఁజక్రాలచేతుల సరుసకువచ్చెను

చ. 1:

నల్లగలువలవంటి నాతిచూపు నీమైనంటి
నల్లనాయ నిలువెల్లా నాథుఁడ నీకు
వెల్లువైన వలపులు వేడుకల నీపైసోఁకె
వెల్లియేరు పాదముతోఁవిభుడవు నైతివి

చ. 2:

బంగారువంటి రూపుపడఁతి పొందు సేయఁగ
బంగరుదట్టిగురుతుపతివైతివి
సంగతిగాఁ దామరలసరవిపాలుమోఁచి
అంగజగురుఁడ జలజాక్షుఁడవైతివి

చ. 3:

వేవేలుమాటలనేర్పువెలఁది కాఁగిటఁగూడి
వేవేలు పేళ్ళు గలిగె వెన్నుఁడ నీకు
భావించఁ గొండలవంటి బలు కుచములునాఁటి
శ్రీ వెంకటేశుఁడవై సిరుల మించితివి