పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0234-4 ఆహిరి సంపుటం: 08-202

పల్లవి:

తప్పులెంచవని నిన్ను దగ్గరితి నిటుగాక
వొప్పగించే బీరాల కోపుదునా నేను

చ. 1:

చిక్కని నీనవ్వులకు చేసేటి చేఁతలకు
యెక్కువగా నింతేసి మోహించితిఁగాక
తక్కుల నీగుట్లకు తచ్చన సన్నలకు
వొక్కమాఁటే యీపనులకోపుదునా నేను

చ. 2:

కన్నుల నీమొక్కులకు కరుణారసానకు
కన్నెనయ్యే నీకు తాళి గట్టితిఁగాక
మిన్నక నీమేకులకు మేరలు మీరుటకు
వున్నతి నీరాఁపులకు నోపుదునా నేను

చ. 3:

కలిసితివి రతికిఁ గడలేని మన్ననకు
పిలిచి నీకే సేస వెట్టితిఁగాక
యెలమి శ్రీవెంకటేశ యిట్టి నీవినయాలకు
వొళవుగా సిగ్గువడ నోపుదునా నేను