పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0232-4 సౌరాష్ట్రం సంపుటం: 08-190

పల్లవి:

నామర్మమిట్టిది యిఁక నీమర్మమానతీరా
యీమేరఁజూచినవారి కెంతబంటోయిఁకను

చ. 1:

మక్కువ నీతో నేను మాటలాడినంతలోనే
పుక్కిటిబంటె (టా?) యరా పూఁచి వలపు
చెక్కుల చెమటలెల్లా చెరువుల వానలాయ
యిక్కడ నన్నుఁ జూచి నీకెంతబంటో యిఁకను

చ. 2:

కన్నుల నీరూపుచూచి కరఁగి గుండెలుమోఁచి
చన్నులబంటె(టా)యరా సరివలపు
వున్నతిఁ మోవితేనియ లువ్విళ్లూరఁగఁ జొచ్చె
యిన్నిటా నా జోడైతి వెంతబంటోయిఁకను

చ. 3:

కలసి నీవద్ద నేను గట్టిపీఁటపై గూచుండి
మొలబంటియాయరా యిమ్ములవలపు
కులికి శ్రీవెంకటేశ కూడితివి వయోమద
మెలిమి మడుగులుబ్బె నెంతబంటోయిఁకను