పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0231-1 కన్నడగౌళ సంపుటం: 08-181

పల్లవి:

ఎవ్వరి నేమడిగేవు యేమని చెప్పేము నేము
జవ్వనపు నీ పంతము సంగడినేవున్నది

చ. 1:

పడఁతి మాటలలోని భావము దెలుసుకొంటే
అడరిన నీ మోహమందేవున్నది
తడఁబడే మతిలోని తలఁపు దెలుసుకొంటే
విడువని నీ నేర్పు వెనకనేవున్నది

చ. 2:

అంగన నవ్వునవ్విన ఆయము దెలుసుకొంటే
అంగవించే నీ భోగ మందేవున్నది
సంగడినాడే సరసములే తెలుసుకొంటే
చెంగటి జాణతనాలు నీ చేతిలోనేవున్నవి

చ. 3:

యింతి కాఁగిలించుకొన్న యితవు దెలుసుకొంటే
అంతటివేడుక నీ యాత్మనున్నది
వంతుల శ్రీవెంకటేశ వనితఁ గూడితివిట్టే
మంతనాలన్నియు నీ మర్మములోనున్నవి