పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0230-1 సామంతం సంపుటం: 08-175

పల్లవి:

ఏమని భావింతు నిన్ను నెంతని సంతోసింతు
శ్రీమంతుఁడ నన్నుదిద్దే చేఁతోయిది

చ. 1:

కాంతుఁడ నేనెంతాడినా గక్కదలవు నీవు
యెంత రాతిగుండెవాఁడ వేమి చెప్పేది
శాంతుఁడవో గట్టువాయిజాణతనమో యిట్టె
మంతుకెక్కించే నామీఁది మన్ననో యిద

చ. 2:

దిట్టనై నేజంక్కిచితే తెమలవేమిటా నీవు
యెట్టి చలపాదివాఁడ వేమి చెప్పేది
గుట్టు నీకింతగలదో గుణము చండిపడెనో
గట్టిగా నన్నీడేర్చే కరుణో యిది

చ. 3:

బిగ్గె నేఁగాఁగిలించితే బెగడవేమిటా నీవు
యెగ్గులెంతెంచనివాఁడ వేమి చెప్పేది
సిగ్గరితనమో నేఁడు శ్రీవేంకటేశ నీనవ్వో
కగ్గులేకేలితివి నాకన్నవరమో యిది