పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0228-6 సాళంగనాట సంపుటం: 08-168

పల్లవి:

పేరు కుచ్చి యాతనితో పిలిపించుకోవలెనా
చేరి వీడెమియ్యఁగదే సిగ్గులింకా నేఁటికి

చ. 1:

సరి నీవు నవ్వితేనే సరసానఁ బైకొంట
యిరవుగాఁ జూచితేనే యియ్యకొనుట
గరిమ మాటాడితేనే కంకణము గట్టుకొంట
సరుగ రావే యేల జాగులు సేసేవు

చ. 2:

చేరి తిట్టినపుడే చేఁతలకు లోనౌట
సారెఁ బయ్యద మూయుటే చవి రేఁచుట
కోరఁగా నానవెట్టుట గోరికొనకు లోనౌట
కూరిమి చేకొని రావే గుట్టింతచూపక

చ. 3:

యెదురెదురనుంటేనే యిచ్చల సేసవెట్టుట
యిదె చెక్కుచేయంటితే నింపు చల్లుట
అదిన శ్రీవేంకటేశుఁడాతఁడు తా నిన్నుఁగూడె
చెదరకిట్ల రావే చెప్పించుకొనక