పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0225-3 ఆహిరి సంపుటం: 08-147

పల్లవి:

నే నేరుపవలెనా నెలఁతకు నివియల్లా
సానఁ బట్టుకో నేరదా సకియ నీమనసు

చ. 1:

నవ్వులనే నీవింత నాలిసేసేవాఁడవౌత
యెవ్వరు నెఱఁగరా యెమ్మెలేఁటికి
నివ్వటిల్లఁ గైలాటాలు నేఁ బెట్టితిననేవింత
జవ్వని యాపెఱఁగదా చల్లని నీగుణము

చ. 2:

జంకెననే నీవప్పటి సందుకొనేవాఁడవౌత
పొంకాన వచ్చేదేకాదా పొద్దువొద్దుకు
సంకెదీర నిన్నాపెతో జగడాలు వెట్టితినా
అంకెల నాపెఱఁగదా అచ్చప నీసాజము

చ. 3:

కందువనింతులఁ జూచి కలసేటి వాఁడవౌత
చందమయ్యేకాదా (?) సారె సారెకు
పొందితి శ్రీవెంకటేశ పొరుగున మమ్మిద్దరి
ముందర నాపెఱఁగదా ముచ్చట నీవలపు