పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0225-2 రామక్రియ సంపుటం: 08-146

పల్లవి:

ఊరకున్నదంటానేల వొరయఁగ వచ్చేవు
నేరుపుల కెల్లానిది నెపమింతే కాక

చ. 1:

పట్టరాదు ముట్టరాదు పడఁతుల మోహము
గుట్టుదెలిసినదాఁకా గురిగాదు
ఱట్టడివి నిన్నాపె యాఱడిసేయ నోపునా
పట్టిన వ్రతముతోడి బలిమే కాక

చ. 2:

చెప్పరాదు చూపరాదు చెలుల కోరికలు
ముప్పిరి మాఁటాడుదాఁకా ముచ్చటాడదు
తప్పనివాఁడవు నీతో తారుకాణ కోపునా
తెప్పగా నీతో నవ్వేతెలివే కాక

చ. 3:

పాయరాదు తోయరాదు పడఁతుల సంగములు
చేయి మీఁదయినదాఁకా సిగ్గువడ (వీడ?) దు
యీయెడ శ్రీవేంకటేశ యింతి నీవురాన నిల్చె
వాయకు గర్వించేదా సలిగింతే కాక