పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0225-4 బౌళిరామక్రియ సంపుటం: 08-148

పల్లవి:

నేరుపరులకునెల్లా నీవు సేసినదే పాడి
అరయఁ గడపరాయ అంతవాఁడవౌదువు

చ. 1:

కందువమాటలనే కంకణాలు గట్టికట్టి
సందడిఁ బెండ్లాడేవు చతురుఁడవు
చందమామగుటుకల సారెనవ్వి వావులెల్లా
అందలానఁ బెట్టుకొంటి వంతవాఁడవౌదువు

చ. 2:

పోరచి మోవితేనెలు పొదిగి తోడంటువెట్టి
సారెకు విందవెట్టేవు చతురుఁడవు
కోరి నిన్నుఁ జూచితే నాకొనచూపుల ముత్యాల
హారాలుగా వేసుకొనే వంతవాఁడవౌదువు

చ. 3:

వొల్లనే చేతులు చాఁచి వుడివోని వలపులు
చల్లి వుంకువలిచ్చేవు చతురుఁడవు
యెల్లగా శ్రీవెంకటాద్రినెనసి నావిన్నపాలు
అల్లంతనే వింటివంతవాఁడవౌదువు