పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0203-1 శంకరాభరణం సంపుటం: 08-013

పల్లవి:

ఆడమె యింకనేమీ నౌఁగాదనుచుఁ దన్ను
సూడుఁబాడు దిద్దేవాఁడు సుద్దులిన్ని నేరఁడా

చ. 1:

పెక్కులు నేర్చినతఁడు బెంబాడిచేఁతలతఁడు
దిక్కులఁ దననేరాలు దిద్దుకోలేఁడా
చక్కని పదారువేలు సతులఁ దెచ్చినతఁడు
పక్కన మావంటివారి భ్రమయించనోపఁడా

చ. 2:

రాతిరిపనులాతఁడు రవ్వల కెక్కినతడు
భీతిలేక ఆనలెల్లాఁ బెట్టుకోలేఁడా
ఈతల రుక్మిణీదేవి నెత్తుక తెచ్చినతఁడు
చేతులు మాపై జాఁచి చెనకక మానునా

చ. 3:

దేవర దానై నతఁడు దిమ్మరివిద్యలతఁడు
యీవేళ నాకోరిక యీడేర్చలేఁడా
శ్రీ వేంకటేశుఁ డితఁడు చేరి నన్నునిటు గూడె
వేవేలు మన్ననలచే వెలయించుటరుదా