పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0221-1 ?? సంపుటం: 08-121

పల్లవి:

నిన్నటినుండిఁ జూచేను నీసరితలు
యెన్నికె కెక్కేదెట్లో యిందరిలో నేను

చ. 1:

చెంతలఁ జేరినవారిని చెక్కులు నొక్కేవు
అంతనింతానుండ వారినాదరించేవు
దొంతులు వెరిగి గొల్లదోమటాయ వలపు
యెంతటి దాననయ్యేనో యిందరిలో నేను

చ. 2:

మాటలాడినవారిని మనసులు గరఁచేవు
సూటిఁ జూచినవారినిఁ జొక్కించేవు
వాటమై వరత వచ్చె వనితల కోరికలు
యీటు వెట్టుకొన నేను యెవ్వరిఁ బోలుదును

చ. 3:

కూడిన కాఁగిటివారి కొప్పులు దువ్వేవు
మేడెపు రతులవారి మెప్పించేవు
వాడుదేరె జవ్వనాలు వంతుల శ్రీవేంకటేశ
యీడ నన్నుఁ గూడితివి యెంతభాగ్యమోనాది