పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0221-2 మధ్యమావతి సంపుటం: 08-122

పల్లవి:

ఇంకనేఁటి విచారాలు యెందాఁకారా
లంకెపాటు తమకాలు లావుసేసెఁ గదరా

చ. 1:

పట్టరాదు నీవయసు పాయరాదు నీపొందు
యెట్టననరాదు నిన్ను నేమి సేతురా
గుట్టువేఁచె మదనుఁడు గుమిగట్టెఁ గోరికలు
ఱట్టయితి నీచేఁతలాఱడికెక్కెఁ గదరా

చ. 2:

చెప్పరాదు నీమనసు చించరాదు నీవలపు
యెప్పుడ నేనొక్కజోడె యేమిసేతురా
చొప్పులెత్తె పువ్వుటమ్ము సోలినిండెఁ బులకలు
దప్పిగొంటి నీసుద్దుల తతి వచ్చెఁగదరా

చ. 3:

తుంచరాదు నీమదము దొబ్బరావు దినములు
యించుకంతె నాసిగ్గు యేమిసేతురా
కొంచక శ్రీవేంకటేశ కూడితివి నన్నునిట్టె
పంచల నీమన్ననలు పాటమాయ గదరా