పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0220-6 సామంతం సంపుటం: 08-120

పల్లవి:

ఇంకా నీచిత్తము యేమనే నిన్ను
అంకెకు రావు సిగ్గులు ఆఱడాయ వలపు

చ. 1:

చలము సాదించరాదు చనువు మెరయరాదు
పలిచి చన్నులంటేవు ప్రియముతోడ
కలకల నవ్వేవు కప్పురము చల్లేవు
చలివాయవు సిగ్గులు చండిపడె వలపు

చ. 2:

పేరుకొని దూరరాదు పెనఁగి మొక్కఁగరాదు
నారువోసేవు నామీఁద నయగారాలు
మేరమీరి చెనకేవు మెచ్చి విడెమిచ్చేవు
తీరవెంతైనా సిగ్గులు దిమ్మురెఁగె వలపు

చ. 3:

గక్కన జంకించరాదు కాయము మరవరాదు
యెక్కువ శ్రీవేంకటేశ యిట్టె కూడితి
దక్కి నాకు లోఁగేవు తనువెల్ల నిమిరేవు
తక్కువగావు సిగ్గులు తతిగొనె వలపు