పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0220-5 నాదరామక్రియ సంపుటం: 08-119

పల్లవి:

ఆతని భ్రమయించే (చవే?) వే అండనున్నాఁడు
యేతులునెమ్మెలుఁ జూపేవిప్పుడే మాతోనా

చ. 1:

చన్నులు ఘనములైతే సాధించవే రమణుని
కన్నులు ఘనములైతే కాఁడి పారఁ జూడవే
యెన్న నీసింగారాలు యెవ్వరికిఁ జూపేవు
పన్నిన సవతినింతే పగటు మాతోనా

చ. 2:

వలపు చిత్తాననుంటే వంచుకోవే నీవిభుఁని
పలుకుల నేర్పులుంటేఁ బచరించవే
సొలపుల నీనటన చూచేవారిందెవ్వరే
చెలిమికత్తెలమింతే చేఁతలు మాతోనా

చ. 3:

సిగ్గులు సెలవినుంటే శ్రీవేంకటేశు ముంచవే
నిగ్గులు చెక్కులనుంటే నీటు చూపవే
యెగ్గులేక ఆతఁడే యిద్దరినేలెను నేఁడు
వెగ్గళించి మురిసేటి వింతలు మాతోనా