పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

137

రచనలు


కానీ ఆర్పివేసిన జ్వాల, క్రొత్త జ్వాల ఒక్కటి కావు. పాతదానిని అంతంచేశాకే కొత్తది వస్తుంది. ఒక్కటే రూపాంతరం చెందుతూ ఎప్పటికీ కొనసాగుతుంటే కొత్తది అప్పుడు వుండనే వుండదు. వేయి నిన్నలను కొత్తవాటిగా మార్చలేము. కొవ్వొత్తి కూడా పూర్తిగా కాలాక అయిపోతుంది. ప్రతిదీ, కొత్తది రావడం కోసం సమాప్తమై తీరాలి.

ఇప్పుడు ఆ మేనమామకు వుదాహరణాల వ్యాఖ్యలు, నమ్మకాలు, యితరుల సూక్తులు ఏవీ సహాయపడటం లేదు. అందుకని తనలోకి తను ముడుచుకొనిపోయి, మెదలకుండా కూర్చున్నారు. అయితే ఆయనలో అయోమయం, ఆగ్రహం కూడా కలిగాయి. ఎందుకంటే తాను ఏమిటో ఆయనకే చాలా బాహటంగా కనిపించింది. తన మేనకోడలిలాగే ఆయనా ఆ వాస్తవాన్ని సూటిగా చూడటానికీ యిష్టపడటంలేదు, ఇదంతా నాకు అక్కర్లేదు' అన్నారు ఆమె. నేను దారుణమైన వేదనలో వున్నాను. భర్తనీ, కొడుకునీ పోగొట్టుకున్నాను. ఇద్దరు పిల్లలూ, నేనూ మిగిలి వున్నాం. నేను యిప్పుడు ఏం చేయాలి?'

ఆ యిద్దరు పిల్లల మీద కనుక మీకు శ్రద్ధవుంటే, మీ గురించి, మీ వేదన గురించి విచారించరు. వాళ్ళ ఆలన, పాలన చూస్తారు; సవ్యంగా చదివిస్తారు, సగటురకంగా తయారవకుండా వాళ్ళని పెంచుతారు. మీమీదే జాలిలోపడి మీరు మునిగిపోరు. దానినే 'నా భర్తమీద ప్రేమ' అని అంటూవుంటే, మీ ఒంటరితనంలోకి మీరు ముడుచుకొని పోతూవుంటే, యీ యిద్దరు పిల్లల జీవితాలనీ కూడా మీరు ధ్వంసం చేసేస్తారు. మనకి తెలిసో, మనకీ తెలియకుండానే విపరీతమైన స్వార్థపరత్వం మనందరిలోనూ వున్నది. మనకి కావలసినవి మనకు దొరుకుతున్నంతవరకు అంతా సవ్యంగా వున్నట్లు పరిగణిస్తాం. దీన్నంతటినీ భగ్నం చేసే సంఘటన ఏదయినే జరిగిన మరుక్షణమే నిస్పృహతో ఏడ్చేస్తాం. ఇంకోరకమైన సౌఖ్యాలకోసం చూస్తాం. అవీ యీ విధంగానే భగ్నమవడం ఖాయమనుకోండి. ఈ ప్రక్రియ అంతా యిట్లాగే సాగిపోతూ వుంటుంది. ఇందులో వున్న సాధక బాధకాలన్నీ పూర్తిగా తెలుసుకొని కూడా, దానిలో చిక్కుకొని పోవాలని మీరు కోరుకుంటే, నిక్షేపంగా కానివ్వండి. అయితే అందులోని అసంబద్దతనంతా గ్రహించినప్పుడు దానంతట అదే మీ ఏడుపూ ఆగిపోతుంది, మీరు ఒంటరితనంలో మునిగిపోవడమూ మానేస్తారు. ఒక కొత్త కాంతితో, ఒక చక్కని చిరునవ్వుతో మీ పిల్లలతో జీవితం గడపడం ఆరంభిస్తారు.

(ది వోన్లీ రివల్యూషన్)