పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భద్రత

వరిమళ్ళని చుట్టుకుంటూ పోతున్న యీ త్రోవ పక్కనే ఒక చిన్న కాలువ మందంగా ప్రవహిస్తూ వుంది. దాని నిండా తామరపూలు విచ్చుకొని వున్నాయి. మధ్యలో బంగారపు రంగు బొడ్లతో వున్న ఆ ముదురు వూదా రంగు పూలు నీళ్ళమీద బాగా పైకి వచ్చి తేలుతున్నాయి. వాటి పరిమళం పూలని అంటిపెట్టుకొని అక్కడే వుండిపోయింది. చాలా అందంగా వున్నాయి ఆ పూలు. ఆకాశం మేఘావృతమై వుంది. సన్నగా జల్లు పడడం మొదలయింది. మబ్బులు వుండి వుండి వురుము తున్నాయి. ఎక్కడో చాలా దూరంలో మెరుపులు మెరుస్తున్నాయి. కాని త్వరలోనే మేము నిలబడిన చెట్టు వైపుగానే రాబోతున్నాయి. వర్షం బాగా ఎక్కువైంది. తామర ఆకులమీద నీటి బిందువులు నిలబడిపోతున్నాయి. నీటి బిందువులు కొన్ని పోగయ్యాక, అవి మరీ పెద్దవైనప్పుడు ఆకులమీద నుంచి జారి కిందపడిపోతున్నాయి. మళ్ళీ కొత్త బిందువులు పోగవుతున్నాయి. ఇప్పుడు మా చెట్టుమీదే మెరుపులు మెరవడం ఆరంభమైంది. పశువులు భయపడిపోయి 'కట్టుతాళ్ళని తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నల్లని దూడ ఒకటి బాగా తడిసి, వణికిపోతూ, ఆతిదీనంగా అరిచింది. తరువాత తాడు తెంపేసుకొని, దగ్గరలోనే వున్న గుడిసెలోకి పరుగెత్తింది. తామరపూలు గట్టిగా ముడుచుకొని పోతున్నాయి. చుట్టూ ముసురుకుంటున్న చీకట్లనుండి తమ హృదయాలను దాచుకుంటున్నాయి. ఇప్పుడు వాటి లోపల వున్న బంగారపురంగు బొడ్లను చూడాలంటే వూదారంగు పూరేకులను బలంగా పీకి తెరవాలిసిందే. మళ్ళీ సూర్యుడు కనబడేదాకా అవి గట్టిగా ముడుచుకొనిపోయి వుంటాయి. అట్లా నిద్ర పోతున్నప్పుడు కూడా అవి ఎంతో అందంగా వున్నాయి. విద్యుల్లతలు వూరివైపుగా కదులుతున్నాయి. ఇప్పుడిక బాగా చీకటి పడిపోయింది. కాలువ నీటి గలగలల చప్పుడు మాత్రం సన్నగా చెవులకు వినిపిస్తున్నది. ఈ త్రోవే గ్రామాన్ని దాటుకుంటూ రహదారి వద్దకు చేరుస్తుంది. ఆ రహదారిమీదే ప్రయాణించి, కోలాహలంగా వుండే పట్టణాన్ని, తిరిగి మేము చేరుకున్నాం.

అతను యువకుడు. వయసు యిరవైలలో వుంటుంది. మంచి పోషణలో పెరిగిన శరీరం. ప్రపంచం కొంత తిరిగి చూశాడు. కళాశాలలో చదువుకున్నవాడు. భయభయంగా కనబడుతున్నాడు. అతని కళ్ళల్లో ఆదుర్డా వుంది. అప్పటికే ఆలస్యమైంది. కాని అతను ఏదో మాట్లాడాలన్నాడు. తన మనసును ఎవరయినా శోధించి, అక్కడ ఏమున్నదో వెదికి కని పెట్టాలని కోరాడు. చాలా మామూలుగా తనని