136
కృష్ణమూర్తి తత్వం
అది. హఠాత్తుగా ఆయన లేచి నిటారుగా కూర్చోవడం అందరూ గమనించారు. ఆయన కళ్ళల్లోకి యుద్ధపు మెరుపులు, మాటలతో చేసే యుద్ధపు మెరుపులు వచ్చాయి. సానుభూతి, ప్రేమ, అవగాహన అన్నీ పోయాయి. ఆయన యిప్పుడు నమ్మకమూ, సంప్రదాయమూ అనే పవిత్ర రంగం మీదకు, నిబద్ధీకరణం అనే అతిభారమైన బరువుతో బలంగా ముద్రలు పడిపోయిన రంగం మీదకు ప్రవేశించారు. 'కాని ఆత్మ అనే ఒకటి మనందరిలోనూ పున్నది! ఆది పునర్జన్మల ద్వారా కొనసాగుతూవుంటుంది, చివరకు తానే బ్రహ్మ అనే పరమార్థాన్ని చేరుకునేదాకా జన్మిస్తూనే వుంటుంది. ఆ పరమసత్యాన్ని అందుకోవాలంటే యీ దుఃఖాన్ని మనం అనుభవించి తీరాలి. మనం మాయలో జీవిస్తుంటాం. ఈ లోకమంతా మాయ. పరమసత్యం మాత్రం ఒకే ఒక్కటి.'
అట్లా సాగిపోతున్నారు ఆయన, ఆమె నావైపే చూస్తున్నారు, ఆయన చెప్తున్నది వినిపించుకోవడం లేదు. ఆమె ముఖం సన్నని చిరునవ్వుతో విచ్చుకోవడం మొదలు పెట్టింది. మేమిద్దరం తిరిగివచ్చిన పావురంవైపు, ఎర్రగా మెరిసిపోతున్న బోగనవిల్లా పూలవైపు చూస్తూ వుండిపోయాం. ఈ భూమిమీద కానీ, మనలో కాని శాశ్వతమైనవి ఏవీ లేవు. ఒకదానిని, గురించి తాము ఆలోచన చేసి, దానికి శాశ్వతంగా వుండే గుణాన్ని ఆపాదించగలవు ఆలోచనలు. ఒక మాటకు, ఒక భావానికి, ఒక సంప్రదాయానికి ఆలోచనలే శాశ్వతత్వాన్ని యిస్తాయి. ఆలోచన తాను శాశ్వతం అని అనుకుంటుంది. కాని, అది శాశ్వతమా? ఆలోచన అంటే స్మృతి స్పందించడం, ఆ స్మృతి శాశ్వతమా? ఆలోచన ఒక కాల్పనిక బింబాన్ని నిర్మించి, ఆ కల్పిత చిత్రానికి కొనసాగే గుణమూ, శాశ్వతత్వమూ యిచ్చి, దానికి ఆత్మ అనో, లేదూ యింకొక పేరే పెట్టగలదు. భర్తదో, భార్యదో ఒక ముఖాన్ని జ్ఞాపకం పెట్టుకొని, దాన్ని పట్టుకొని వేలాడనూగలదు. ఇదంతా ఆలోచనలు చేసే కార్యకలాపాలు. ఇవి భయాన్ని సృష్టిస్తాయి, ఆ భయంలోనుండి శాశ్వతత్వం కోసం తపన బయలుదేరుతుంది- రేపు భోజనం దొరకదేమో, ఆశ్రయం దొరకదేమో అనే భయాలు, మరణం అంటే భయం మొదలైనవి. ఆలోచనలకు ఫలితమే యీ భయం. బ్రహ్మం కూడా ఆలోచనలు తయారు చేసిన వుత్పత్తే. 'స్మృతి, ఆలోచన కొవ్వొత్తి వంటివి. వాటిని ఆర్పేయవచ్చు, మళ్ళీ వెలిగించ వచ్చు. మర్చిపోతారు, మళ్ళీ కొంతకాలానికి జ్ఞాపకం తెచ్చుకుంటారు. చనిపోతారు, మళ్ళీ యింకో జన్మలో పునర్జన్మ ఎత్తుతారు, కొవ్వొత్తిలో వెలిగే జ్వూల ఒకటే- ఒకటి కానూ కాదు. కాబట్టి యీ జ్వాలలో కొనసాగడం అనే ప్రత్యేక గుణం వున్నది' అని మేనమామ అన్నారు.