పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

కృష్ణమూర్తి తత్వం

ప్రశ్న: మీరు చెప్తున్న యీ స్వీయజ్ఞానం అంటే ఏమిటి? నేను అది ఎట్లా సంపాదించగలుగుతాను? దీనికి ఆరంభం ఎక్కడ? ఎట్లా?

కృష్ణమూర్తి: సరే, దయచేసి శ్రద్దగా వినండి. స్వీయ జ్ఞానాన్ని గురించి మీకేవేవో విపరీతమైన పూహలు వున్నాయి- స్వీయజ్ఞానాన్ని సంపాదించడానికి రోజూ సాధన చేయాలనీ, ధ్యానం చేయాలనీ, యింకా రకరకాలవేవో చేయాలనీ మీరు అనుకుంటూ వుంటారు. కానీ సర్! యిది చాలా సులువుగా చేయచ్చు. స్వీయజ్ఞానానికి మొదటిమెట్టే ఆఖరిమెట్టు కూడా ఆరంభమే ముగింపు. ఆ మొదటి సోపానమే ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే స్వీయజ్ఞానం మరొకరి ద్వారా నేర్చుకోనేది కాదు. ఎవరో వచ్చి మీకు మీ స్వీయజ్ఞానం బోధించలేరు. మీకు మీరుగా తెలుసుకోవాలి. మీ అంతట మీరే స్వంతంగా కనుక్కోవాలి. అయితే యీ కని పెట్టినది బ్రహ్మాండంగానూ, అత్యద్భుతంగానూ వుండదు. చాలా సరళసామాన్యంగా వుంటుంది. నిజంగా చూస్తే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే, మీ ప్రవర్తన తీరును, మీ మాటలను, దైనందిన జీవితంలోని మీ బాంధవ్యాలలో ఎట్లా వుంటారు అనేవాటిని జాగ్రత్తగా గమనించడం, అంతే. దాంతో ఆరంభించండి. అప్పుడు యీ ఎరుకతో వుండటం- అంటే - మీరు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారు, నౌకరుతో మాట్లాడేటప్పుడు, పై అధికారితో మాట్లాడేటప్పుడు ఏయే మాటలు వుపయోగిస్తుంటారు, మనుష్యుల ఎడల, రకరకాల భావాల ఎడల, యితర విషయాల ఎడల మీరు ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తారు అన్నవి జాగ్రత్తగా గమనించడం; యిదంతా- ఎంత మహా కరినంగా వుంటుందో తెలుసుకుంటారు. మీ ఆలోచనలను, మీ వుద్దేశ్యాలను, సంబంధ బాంధవ్యాలనే అద్దంలో ఒకసారి గమనించండి; గమనిస్తున్న క్షణంలోనే, 'ఇది మంచిదే, అది మంచిది కాదు, నేను యిది చేయాలి, అది చేయకూడదు' అనుకుంటూ సరిదిద్దుకోవాలని చూస్తారు. బాంధవ్యాలు అనే అద్దంలో మిమ్మల్ని మీరు పరికించుకుంటున్నప్పుడు ఖండించేదో, సమర్థించేదో అయిన దృష్టి మీలో వుంటుంది. అందువల్ల మీరు చూస్తున్న దానిని వక్రీకరిస్తారు. అట్లాకాకుండా, ఆ అద్దంలో చూస్తూ, యితరుల ఎడల, సిద్ధాంతాల ఎడల, విషయాల ఎడల మీ వైఖరి ఎట్లా వున్నది అనేదాన్ని వూరికే గమనిస్తూ, తప్పొప్పుల నిర్ణయం చేయకుండా, ఖండించకుండా, ఆమోదించకుండా కేవలం యదార్థాన్ని మాత్రం చూడండి. అప్పుడు ఆ గ్రహింపులోనే దానివల్ల జరిగే చర్య కూడా వున్నదని తెలుసుకుంటారు. స్వీయజ్ఞానానికి యిదే ఆరంభం.