Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందేహాలు, సమాధానాలు

113

ఎందుకంటే ఆలోచించడం అంటేనే దుఃఖాన్ని కొనితెచ్చుకోవడం అని గ్రహించాడు కాబట్టి. అయితే అసలు అది ఎట్లా సాధించగలం? ఇందులో అనేకమైన విషయాలు కలిసిపోయి వున్నాయి. ఆలోచన్లని ఆపివేయాలనీ మీరు ప్రయత్నించిన మరుక్షణంలోనే అది ఒక సమస్య అయి కూర్చుంటుంది. ఒక పరస్పర వైరుధ్యంగా తయారవుతుంది. ఆలోచనను ఆపుచేయాలని మీరు చూడటం, అదేమో యింకా యింకా సాగుతూ వుండటం, ఈ పరస్పర వైరుధ్యమే సంఘర్షణను పెంచి పోషిస్తుంది. వైరుధ్యాలన్నీ కూడా సంఘర్షణలకు ఆటపట్టులు. కాబట్టి మీరు చేసింది ఏమిటి? ఆలోచనలను మీరు అపలేక పోయారు. పైగా మరో కొత్త సమస్యను పట్టుకొచ్చారు. అదే సంఘర్షణ ఆలోచనలను ఆపాలని ఏ ప్రయత్నం చేసినా దానివల్ల ఆలోచనకి మరికొంత మేత దొరికి, యింకాస్త బలం పుంజుకుంటుంది. మీరు ఆలోచించి తీరాలి, తప్పదు అని మీకు తెలుసు. స్పష్టంగా, దోషరహితంగా, స్థిరచిత్తంతో, హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించడానికి మీ వద్ద వున శక్తిలో ప్రతిబొట్టూ వుపయోగించవలసి వస్తుంది. అయితే ఆరోగ్యకరమైన, హేతుబద్దమైన, తార్కికమైన ఆలోచనలు ఆలోచించడాన్ని ఆపలేవనే సంగతి కూడా మీకు తెలుసు.

ఇప్పుడిక మీరు ఏం చేయాలి? ఆలోచించడం ఆపి తీరాలి అనే ఒక సూత్రం తయారు చేసుకొని, అది సాధించడానికి అణచి వేసుకోవడం, క్రమ శిక్షణలో పెట్టుకోవడం, లోపలకు తొక్కి చేసుకోవడం, నిరోధించడం, లొంగిపోయి వుండటం వంటి ఏ పద్దతిని అవలంబించినా అది దండగే అని మీకు తెలుసు. అవన్నీ తోసి పారేశేయ్యండి. ఆ పని చేశారా? త్రోసివేసేక అప్పుడిక ఏం చేస్తారు? బొత్తిగా ఏమీ చేయరు! మొదట్లో యిదంతా ఆపి వేయాలని ఒక ఆలోచన చేశారు. అది ఒక భావన. దాని వెనకాల ఒక వుద్దేశ్యం వుంది. అదంతా ఆపివేయాలని అసలు మీరు ఎందుకు అనుకున్నారంటే ఆలోచన ద్వారా ఏ సమస్యా పరిష్కరించలేక పోయారు కాబట్టి. అందువల్ల మనస్సు- మనస్సులోని ఏదో ఒక భాగం కాదు, ఒక ప్రత్యేకమైన చిన్న ముక్కకాదు, మొత్తం మనసు సంపూర్ణంగా- నాడీమండలం, మెదడు, మనోభావాలు, అన్నీ --వీటన్నింటినీ కలుపుకొని వుండే ఆ మనస్సు యీ విషయంలో ఏమీ చేయలేనని గ్రహించగలుగుతుందా? అది తెలుసుకున్నాక కూడా అట్లానే సాగిపోతుందా? అట్లా సాగిపోదని మీరే కని పెడతారు.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, XVI పొల్యూమ్,

సానెన్, 19 జూలై, 1966.