Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందేహాలు, సమాధానాలు

115


మిమ్మల్ని మీరే జాగ్రత్తగా గమనించుకుంటూ వుండటం, మీరు చేస్తున్నదానిని, మీరు ఆలోచిస్తున్నదానిని, మీ లోపలి వుద్దేశ్యాలు ఏమిటి, మీకు ప్రేరణ కలిగించే ఆకర్షణలు ఏవి అని పరిశీలిస్తూ వుండటం; పైగా చూడటంలో ఖండనగాని, సమర్ధనగాని లేకుండా వుండటం మహా కరినమైన పని. ఎందుకంటే మొత్తం మీ నాగరికత అంతా ఖండించడం, తప్పొప్పులు నిర్ణయించడం, విలువలు బేరీజువేయడం అనేవాటి మీద ఆధారపడి వున్నది. “ఇది చేయాలి, యిది చేయకూడదు” అని నేర్పిస్తూ మిమ్మల్ని పెంచడం జరిగింది. బాంధవ్యం అనే అర్ధంలో కనబడుతున్న దానిని, ఆ వున్నదానికి విరుద్ధమైనది తయారుచేయకుండా చూడగలిగినప్పుడు, స్వీయజ్ఞానానికి ఒక ముగింపు అంటూ లేదని అప్పుడు మీరే గ్రహిస్తారు.

చూడండి, స్వీయజ్ఞానం కోసం చేసే శోధన మొదటగా ఒక బాహిరమైన కదలిక ఆ తరువాత అది అంతర్ముఖంగా మళ్ళుతుంది. ముందుగా నక్షత్రాల దిక్కుగా చూస్తాం. ఆ పైన మన లోపలకు మనం చూసుకుంటాం. అదే విధంగా, యదార్థమైన దీనికోసం, దేవుడికోసం, భద్రతకోసం, సంతోషం కోసం ముందుగా యీ దృశ్య ప్రపంచంలో వెతుకుతాం. అక్కడ కనబడనప్పుడు అంతర్ముఖంగా మళ్ళుతాం. స్వీయజ్ఞానం వలన లోపలవున్న దేవుడి కోసమో, పరబ్రహ్మం కోసమో లేదూ ఏదో మీరు పెట్టుకున్న పేరు కోసమో సాగించే అన్వేషణ ఆగిపోతుంది. మనసు అప్పుడు చాలా నెమ్మదిగా అవుతుంది. అది క్రమశిక్షణ వల్ల కాకుండా కేవలం అవగాహన ద్వారా, జాగరూకతతో గమనించడం ద్వారా, మనసు తనని గురించి తాను ప్రతి క్షణమూ నిరపేక్షకమైన ఎరుకతో వుండటం ద్వారా మాత్రమే యిది జరుగుతుంది. “నేను ప్రతి క్షణమూ ఎరుకతో వుండితీరాలి” అని అనకండి. ఎందుకంటే, ఒక గమ్యం చేరాలనీ, ఒక ప్రత్యేకమైన స్థితిని అందుకోవాలనీ మనం కోరుకుంటుంటే అది మన మూర్ఖత్వానికి మరొక ప్రత్యక్ష నిదర్శనం అవుతుంది. ముఖ్యమైనది ఏమిటంటే మీ గురించి మీరు ఎరుకగా వుండటం. అదంతా పోగుచేసి నిలవవుంచు కోవడం కాకుండా ఎరుకగా వుంటూనే వుండటం, ఎందుకంటే నిలవచేసుకోవడం ఆరంభించగానే ఆ ఏర్పడిన కేంద్రంలో నుండి విమర్శించడం మొదలవుతుంది. స్వీయజ్ఞానం అంటే పోగుచేసుకొని నిలవవుంచుకునే ప్రక్రియ కాదు. సంబంధబాంధవ్యాలలో ప్రతి క్షణమూ 'కనిపెట్టడం' అనే ఒక ప్రక్రియ.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VIII వాల్యూమ్,

బొంబాయి. 20 ఫిబ్రవరి 1955.