పుట:కాశీఖండము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 79

యమరేంద్రులార! లోలార్కకేశవులార!
వనజసంభవ! పోయివత్తు నయ్య!
శ్రీవిశాలాక్షి! దాక్షిణ్యపుణ్యకటాక్ష!
వాసవార్చిత! పోయివత్తు నమ్మ!
శ్రీపూర్ణభద్రపారిషదనాయకులార!
వటుకభైరవ! పోయివత్తు నయ్య!
తే. తీర్థసంవాసులార! కృతార్థులార!
పాశుపతులార! భాగ్యసంపన్నులార!
మందిరోద్యానవాటికామఠములార!
పోయివచ్చెద మీకాశిపురము వెడలి! 139

సీ. కలహంసి! రారాదె కదలి నాతోఁ గూడి
నీవేల వత్తమ్మ నెమ్మి నుండి
కదళికాకాంతార! కదలి రా ననుఁ గూడి
నీ వేల వత్తమ్మ నెమ్మి నుండి
శ్రీవిశాలాక్షి! విచ్చేయు నాతోఁ గూడి
నీ వేల వత్తమ నెమ్మి నుండి
నాతోడఁగూడి యంతర్గేహ! యే తెమ్ము
నీ వేల వత్తమ్మ నెమ్మి నుండి
తే. రండు ననుఁ గూడి యోపరివ్రాట్టులార!
వత్సలత గల్గి మీరేల వత్తు రయ్య !
పరమనిర్భాగ్యుఁ డైననాపజ్జఁ బట్టి
కటకటా! సౌఖ్యజలరాశిఁ గాశిఁ బాసి. 140

వ. అని యెట్టకేలకుఁ గాశీనగరంబు వెడలి కొంతదవ్వు నడచి కాశీవిప్రయోగతీవ్రవేదనాదూయమానమానసుం డై వద