పుట:కాశీఖండము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80 శ్రీకాశీఖండము

నంబు వఱువట్లు పట్టం బాదంబులు గుదివడ నుహ్హనుచు నొకవటవిటపినీడ నజ్జటాధరుండు చతికిలంబడి లోపాముద్ర కిట్లనియె. 141

తే. భూమిపతిపుత్త్రి! చెప్పుమా బుద్ధిమతివి
కాశి వెడలంగ వలసె నేకారణమునఁ
గారణము లేక యూరక కలుగు నెట్లు
సుఖము దుఃఖము నరునకు సులభలీల? 142

వ. కాశ్మీరంబులయందుఁ గుంకుమం బనునది దేశాపేక్ష; దివంబునంద కమలవికాసంబు, రాత్రియంద యుత్పలవికాసంబు ననునది కాలాపేక్ష; పుణ్యవంతునకు సుఖంబు, పాపిష్ఠునకు దుఃఖంబు ననునది యదృష్టాపేక్ష; సర్వంబును నీశ్వరేచ్ఛాయత్తం బనునది యీశ్వరాపేక్ష; విశ్వంబును గ్రహవశం బనునది గ్రహాపేక్ష; మాకుఁ జూడ నీశ్వరప్రేరణంబునం గర్మంబు సుఖదుఃఖంబుల నాపాదించు; ఈశ్వరుం డెవ్వని రక్షింపవలసె వానిచేఁ బుణ్యకర్మంబులు చేయించు నెవ్వనిం జెఱుపవలసె వానిచే బాపకర్మంబులు చేయించు అవిద్యాస్మితరాగద్వేషాదిలక్షణక్లేశపంచకమూలంబున గదా కర్మాతిశయంబు? అక్కర్మఫలం బిహలోకపరలోకంబులం బ్రాణు లనుభవింతురు. కర్మంబునకు మూలభూతంబైన క్లేశపంచకం బెంతకాలం బనువర్తించు నంతకాలంబునకుఁ ద్రివిధంబు పరిపాకంబు నానావిధయోనిజన్మప్రాప్తియు నాయువు సుఖదుఃఖఫలోపభోగంబును జన్మంబున జన్మహేతుకర్మంబు చరితార్థం బయ్యెనేనియు నవశిష్టంబులై యాయుర్హేతువులు భోగహేతువులు నైన కర్మంబులకు ఫలానురూపం బైనభోగంబులు బరమేశ్వరుండు గల్పించుచుండు. 143