పుట:కాశీఖండము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

135

శ్రీకాశీఖండము


సీ.

సంచారలోలుఁ డౌ జగదుపక్రియకు నై
        సమధికస్థైర్యంబు జరుపుఁ గాని
జనులదృష్టికి వెక్కసం బై విభాసిల్లు
        లోనఁ జైతన్యంబు నీనుఁ గాని
సంతాపహేతు వౌ సంయమిశ్రేణికి
        నిర్వాణలీల యీ నేర్చుఁ గాని
ఖరరుచిత్వముఁ బూనుఁ గాలక్రమంబున
        శీతలామృతము వర్షించుఁ గాని


తే.

ప్రాగవస్థాభ్యధికతరోపర్యవస్థ
నతిశయిల్లుచు భువనంబు లఖిలములుసు
వార కత్యంతచాతుర్యవైభవమున
ననఘ! రక్షించుచుండు నీయబ్జహితుఁడు.

175


వ.

అని రప్పుడు శివశర్మ దా నొనర్చునమస్కారంబు లంగీకరించుచు నిమేషార్ధమాత్రంబున రెండువేలు నిన్నూటరెండుయోజనంబు లతిక్రమించినం జూచి యాశ్చర్యం బంది గోవిందకింకరుల కి ట్లనియె.

176


తే.

అనఘులార! ఖరాంశుబింబాంతరమునఁ
బురుషు నొక్కని నుండఁ జెప్పుదురు బుధులు
పరమతాత్పర్యగరిమ సప్పురుషు నెట్లు
సేవసేయుదు రొక్కొ సంసిద్దిపరులు?

177


వ.

అనిన వార లిట్లనిరి.

178


సీ.

ఆకాశమధ్యస్థ మగుభానుబింబంబు
        విను లక్షయోజనవిస్తృతంబు