పుట:కాశీఖండము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

శ్రీమద్దేసటి వంశ
గ్రామణి! మూర్థాభిషిక్తకంఠీరవ! సు
త్రామనిభవైభవోన్నత!
భామాపాంచాల! వీరభద్రనృపాలా!

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె.

2


ఉ.

ఆపృథివీధరంబు హృదయంబున సంతస మందె నెంతయుం
గోపనుఁ డెల్లకాలమును గుంభభవుం డతఁ డిప్పు డుగ్రుఁడై
శాపవిషప్రయోగమునం జంపఁదలంచిన నడ్డ మెవ్వ ర
ష్టాపదశైల మిప్పటికి శంక వహింపకయుండుఁగావుతన్.

3


వ.

అని కుంభసంభవుని ప్రత్యాగమనంబుఁ గోరుచు వింధ్యాచలంబు వంధ్యోదయం బై వసుంధరాగర్భంబున నడంగియుండె.

4


తే.

ముని జటాధారి శివభక్తుఁ డనఘమూర్తి
యెవ్వఁ డేతెంచు నప్పు డఱ్ఱెత్తిచూచుఁ
గుంభసంభవుఁ డనుకోర్కి కొనలుసాఁగ
వసుమతీధర మతఁ డేల వచ్చు మరలి?

5