పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేషము ధరించి అంత:పురస్త్రీలలో దాగియుండెనట. ప్రాణభయమున క్షాత్రమును విడిచి స్త్రీరూపధారి యైనవాని జంపుట నీతికాదని పరశురాముడు వీనిని విడిచి చనెను. వాని వంశక్రమములు దెల్పుచుంటిమి.

ఇక్ష్వాకు వంశములో ప్రసిద్ధుడు 'సగరచక్రవర్తి'. ఆతని మునిమనుమడు భగీరథుడు. ఆతనినుండి ఎనిమిదవతరమువాడు సుదాస చక్రవర్తి. ఈయన భార్య మహాప్రతివ్రతా తిలక మగు మదయంతీ దేవి. ఈమె గర్భిణియై ఏడేండ్లు మోసియు ప్రసవించనందున వసిష్ఠుడు అశ్మక మనెడి (శస్త్రవైద్యములో కోతకోయు వాడిగల యొకా నొక పనిముట్టు) శస్త్రంబున నా గర్భంబు జేరిన అశ్మకుడ నెడి కుమారుడు పుట్టెను. ఆతనికి మూలకుండు గలిగె. ఈతడు నిర్మూలంబైన రవివంశంబునకు మూలంబగుటంజేసి 'మూలకుం'డనంబరగె. (ఆంధ్ర భాగవతము 9-251-253) మూలకునినుండి ఐదవతరమువాడు రఘుమహారాజు. రఘువునుండి మూడవతరమువాడు దశరథుడు. ఆతని కుమారులు శ్రీరామచంద్రమూర్తియు, భరత, లక్ష్మణ, శత్రఘ్నులు నైయున్నారు. పరశురామునిచే సూర్యవంశ క్షత్రియులందరు నశించిరి. అం దశ్మకుడుకూడ మరణించెను. మూలకుడు మాత్రము చావు తప్పించుకొని ఎట్లో బ్రతికెను. మూలకుడుతప్ప అశ్మకునికి వేరు సంతానము లేదు. అశ్మకునికి సోదరులెవరును లేరు. ఇతరబంధువు లెవరైన నుండిరనిన పరశురామునిచే సూర్యవంశపు రాజులందరును చంపబడిరి. సంహారమునకు తప్పి మిగిలినవారి నందరను వెదకి వెదకి యిరువదొక్క మారులు పరశురాముడు సంహరించియున్నాడని చరిత్ర చెప్పుచున్నది. ఇట్టి స్థితిలో ఈ అశ్మక, మూలకులు రెండు తెగలవారలనియు వా రాంధ్రదేశమునకు వలసపోయి రనియు వీరలే తెలుగు జాతికి మూలమనియు, వారి భాష తెలుగనియు కల్పించివ్రాయుట కేవలము గాలిని మూటగట్టి చరిత్రగా చూపుట గాదా! యని ప్రశ్నించుచుంటిమి. ఇది కేవలము అసత్యకల్పన యనియు అట్టి యసత్యకల్పనలతో చరిత్రను పూరించుట చరిత్రకు ద్రోహముచేయుట యనియు ఊహించ లేవందులకు విచారించు చుంటిమి.