పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంధమును చూపియుండెడివారు. అది కేవలము వారి ఊహాగానమై యున్నది. అశ్మక మూలకులు త్రేతాయుగపు వారు. వారిచరిత్రలు పరంపరగ ఆయాకాలములలో వ్రాయబడుచు రాగా ద్వాపరాంతమున వ్యాసభగవానులు వెనుకటి ప్రమాణగ్రంధముల ననుసరించి తనచే వ్రాయబడిన పురాణములలో కూర్చియుండిరి. వీనికి వ్యతిరేకముగా ఇటీవలి కాలమున వ్రాయబడిన వ్రాతలన్నియు త్యజింపదగినవి. గాని ప్రమాణముగా నంగీకరింపదగినవి కావు. బౌద్ధగ్రంధములు నిన్న మొన్నటి వగుటచే వానిని ప్రమాణముగా జేసి ప్రాచీన వాఙ్మయమును త్రోసివేయుట తెలివితక్కువ పని. అశ్మక మూలకు లనెడి పేరులుగల యిద్దరు రాజు లుండిరని చెప్పబడినంతమాత్రమున 'అశ్మకులు, మూలకులు అనెడి రెండు తెగ లున్నవనియు, వారే ఉత్తరదేశమునుండి వచ్చి కృష్ణాగోదావరీ తీరభూముల నాక్రమించి రనియు వీరి కెవరు చెప్పిరి? ఆ వ్యాసకర్త చూచిన బౌద్ధగ్రంథములో నాయిద్దరి పేర్లు మాత్రముదహరింపబడియున్నవి. మిగిలిన కథయంతయు వ్యాసకర్తగారి యూహాగానము. ఇట్టి యూహలు చరిత్రలుగా పరిగణింపబడుట ఈ ఇరువదవ శతాబ్దములోని హూణభాషా కోవిదులైన హిందూచారిత్రకులలో తప్ప ప్రపంచమునం దేదేశమునను కానరాదు. ఇది కేవలము ఉఃహాపోహలతో గూడిన అసత్యవాదము. ఊహలెప్పుడును చరిత్రలుగా పరిగణింపబడరాదు. ఊహాపోహలతో అసత్యవాదములను కల్పించి తమ దేశమునకును, తమ జాతికిని అవమానమును కూర్చుట ధర్మము కాదని తెలియవలెను. ఇది దేశమునకును జాతికిని ద్రోహముచేయుట యగును.

అశ్మక మూలకుల వృత్తాంతము

'అశ్మకు' డనువాడు సూర్యవంశమునకు చెందిన అయోధ్య రాజు. ఇక్ష్వాకు వంశ సంభవుడు. వాని కుమారుడే మూలకుడు. ఈ మూలకునికి నారీకవచు డను నామాంతరము గలదు. పరశురాముడు అఖిల క్షత్రియుల సంహారము చేయబూనినప్పుడు ఈ మూలకుడు స్త్రీ