పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందు గల దేశమునకు 'అంధ్రదేశ' మను పేరు వచ్చిన దని యెంచుటే సత్యమైన నిర్ణయము."

(ది 1-10-53 గల 'హిందూ'పత్రిక 20, 29 పుటలలోగల ఆంధ్రులను గురించిన వ్యాసమును చూడుడు.)

ఇదియే వీరు ఆంధ్రదేశస్థులైన చాతుర్వర్ణ్యములవారికిని వారి ప్రభువులకును వారి గురుపీఠములకును ఇచ్చిన సమాజర్హత.

ఈ వ్యాసకర్త ఈ వాదమునకు పూర్వచరిత్రలనుండి యెట్టి ప్రమాణములను చూపియుండలేదు. పాశ్చాత్య చరిత్రకారులచే వ్రాయబడిన అసత్యములును అప్రామాణికములు నగు వ్రాతలను తాము నమ్మి వాటిని తర్జుమాచేసి ప్రకటించుటనుబట్టి వారికి పాశ్చాత్య భావదాస్యమెంత కలదో స్పష్టపడుచున్నది. అశ్మకులు మూలకులు, అను రెండు తెగ లున్నట్లు సంస్కృతవాఙ్మయమం దెచ్చటను గానరాదు. ఇతర వాఙ్మయమందును ఉన్నట్లు తెలియుటలేదు. భారతవర్ష ముయొక్క ప్రాచీనకాలపు చరిత్ర తెలిసికొనుటకు సంస్కృత వాఙ్మయ మొక్కటియే శరణ్యము. అంతకంటె గత్యంతరము లేదని అందఱకును తెలిసిన విషయమే. ఇట్టి స్థితిలో సంస్కృత వాఙ్మయమున గల శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాదుల వదలి ఈకాలపు చారిత్రక మహామహులు నిన్న మొన్నటివైన బౌద్ధగ్రంధమునలను, పర దేశములనుండి యీ దేశమును దర్శించి పోవుటకు వచ్చిన యాత్రికులయొక్క తెలిసియు తెలియని వ్రాతలను ప్రమాణముగా నెంచుటవలన వారి కీ దేశముయొక్క సత్యచరిత్ర ఎట్లు తెలియగలదు! నేలవిడిచి సాముచేయువానికి ఏగతి పట్టునో ప్రాచీన దేశీయ వాఙ్మయమును వదలి వ్రాయబడిన వీరి చరిత్రలకుకూడ అదేగతి పట్టగలదు. అనగా అవి తప్పులు తడికలుగా పరిణమించగలవు.

అశ్మకులు, మూలకు లనెడి జాతు లున్నట్లు పూర్వగ్రంధములం దెచ్చటనైన నుదహరింపబడి యుండినచో వ్యాసకర్త అట్టి ప్రమాణ