పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుచంద్ర వసురూపులు పుట్టిరి. వీ రెల్లరు 'అంధకు' లనంబడుదురు. ఎవ్వరేని అనుదినం బీ 'అంధకవంశంబు' ను గీర్తించిన వంశాభివృద్ధి యగు". (బ్రహ్మాండ పురాణము, ఉపోద్ఘాత పాదము, పంచమాశ్వాసము, శ్రీ జనమంచివారి ఆంధ్ర బ్రహ్మాండపురాణము 723, 724 పుటలు, శ్రీమదాంధ్రభాగవతము నవమస్కంధము చూడుడు.)

అంధకు లనెడి శాఖ యాదవవంశములోని యొక ఉపశాఖ. 'అంధకులు' వేరు 'అంధ్రలు' వేరు 'ఆంధ్రులు' వేరు అని తెలియవలెను. 'అంధకు' లెన్నడును 'అంధ్రలు' గాని "ఆంధ్రులు" గాని కానేరదు. అంధకులు చంద్రవంశ క్షత్రియశాఖకు చెందినవారు. 'అంధ్రలు' బాహ్యజాతివారు. "ఆంధ్రులు" చాతుర్వర్ణ్యములతో గూడి వైదికధర్మానుయాయులైన స్వచ్ఛమైన ఆర్యజాతికి చెందినవారు.

ఇక "అంధకవనము" నుగురించి తెలిసికొందము. పూర్వము మహిషాసురు డనెడి యొక రాక్షసుడు గలడు. వీడు హిమాలయప్రాంతముల నివసించెడివాడు. వీడు హిందూస్థానమంతటిని జయించి పాలించెను. రామాయాణము జరిగిన పిమ్మట వీని చరిత్ర జరిగియున్నది. అది ఇరువది నాలుగవ మహాయుగములోని త్రేతాయుగాంతము. (సుమారు ఒక కోటిన్నర సంవత్సరముల పైకాలముగా ఎంచబడుచున్నది.) దేవీభాగవతపురాణము వీని చరిత్రను విశేషముగా చెప్పియున్నది. వీడు పరాశక్తి యనెడి స్త్రీ దేవతచే చంపబడెను. పిమ్మట వీని సామ్రాజ్యము శ్రీరాముని కుమారుడగు లవుని వంశములోని శత్రుఘ్న డనువాని కీయబడినది. వీనికి లోబడిన సామంత రాక్షస రాజులలో "అంధకాసురు" డొకడు గలడు. వీడుత్తరకోసలమును జయించి పాలించెను. ఈ యంధకాసురుడు విహరించిన వనమునకు 'అంధకవన'మని పేరు. హిమాలయ ప్రాంతమున గల ఉత్తర కోసలమనెడి రాష్ట్రమందలి ఈ అంధకవనము వీనిపేర బిలువబడుచున్నది. (శ్రీ ములుగు పాపయారాధ్య విరచితాంధ్ర దేవీ భాగవతము పంచమస్కంధము 411, 464 చూడుడు.)