"దుష్టుడైన కంసుడు యాదవవంశమునకు చెందిన తన జ్ఞాతుల నందరను మధురానగర ప్రాంతముల నుండి తరిమివేయగా యదువులు పదవులు విడిచి నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశంబులు సొచ్చిరి. మచ్చరంబులు విడిచి కొందఱు కంసునిం గొలిచి నిలిచిరి."
(శ్రీ మదాంధ్ర భాగవతము 10-56)
అట్లు దేశమును విడిచిపోయినవారిలో 'అంధకు' లనెడి శాఖవా రుత్తరకోసలంబున పచ్చికగల యీ అంధకవనమున నివసించి గోసంరక్షణచే జీవించిరి. ఈ యంధకవంశమువారి నివాసమువలన తిరిగి అంధకవనము సార్థకనామము గల దైనది.
కంసవధానంతరమున శ్రీకృష్ణభగవానులు కంసభీతులై పరదేశములకు వలసపోయిన జ్ఞాతిసముదాయములను తిరిగి పిలిపించి వారివారి ఆస్తులను వారి కిచ్చియున్నట్లు శ్రీమద్భాగవత మిట్లు చెప్పుచున్నది.
"తదనంతరంబు తొల్లి కంసభీతులై విదేశంబులం గృశియించుచున్న యదు, వృష్టి, భోజ, మరు. దశార్హ, కుకుర, అంధక ప్రముఖులగు సకల జ్ఞాతి సంబంధులను రావించి చిత్తంబు లలర విత్తంబు లిచ్చి వారివారి నివాసంబుల నుండ నియోగించె".
(ఆం. భా. 10. పూర్వభాగము 1402 వచనము)
ఇంకను:-
"యాదవ వృష్టి భోజాంధకులు"
"యదు, వృష్టి, భోజాంధకవంశంబులు"
(ఆం. భా. 10 స్కం. ఉ. భా. 1050, 1333 వ,)
కంసుని దుర్మార్గములు చెప్పుచోట ఆతనిచే బంధింపబడిన వాని తండ్రిని జ్ఞాతులగు రాజులను గురించి ఇట్లు చెప్పబడినది:-