పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథముడు కణ్వమహర్షి. ఈయనకుమారుడు బోధాయనుడు. ఈయన బోధాయన సూత్రములను ధర్మశాస్త్రమును రచించిన సూత్రకర్త. కణ్వమహాముని ఆంధ్రుడు. కాణ్వ శాఖాధ్యయనము చేసిన కాణ్వ బ్రాహ్మణులు విస్తారముగా ఆంధ్రదేశమున గలరు. వీరికి ప్రథమశాఖా బ్రాహ్మణు లని పేరు. వీరిలో వైదిక, లౌకిక శాఖా భేదములు గలవు. కణ్వమహాముని తెలుగు వ్యాకరణమును రచించి యుండుటచే ఈయన తప్పక ఆంధ్రుడని దృఢపడుచున్నది. ఈయన ఆశ్రమము "కణ్వనదీ" తీరమున గలదు. ఈ "కణ్వనది" కృష్ణా నది యుపనదులలో నొకటి కావచ్చునని సందేహవాక్యములతో చెప్పుచున్నారు. ఇదమిత్థమని నిర్ణయించుట కవకాశము కలుగలేదు. అవకాశము కలిగిన సరియైన నిర్ణయము చేసి ప్రకటించగలము. శకుంతలను పెంచిన దీ కణ్వుడే. కాణ్వ శతపథ బ్రాహ్మణమునందీ శకుంతలయొక్కయు, ఆమె కుమారుడును భారత చక్రవర్తియునగు భరతుని యొక్కయు, కణ్వుని ఆశ్రమము యొక్కయు నామములు స్మరింపబడినవి.

"అథ తృతీయయా శకున్తలా నాలపిత్యప్సరా భరతం దధే పర: సహస్రా నిన్ద్రాయా శ్వాన్మేధ్యాన్య ఆహార ద్విజిత్య పృథివీగ్ సర్వామితి."

         (కాణ్వ శతపథ బ్రాహ్మణము. 139 కాండ. 39 అధ్యా. 4 బ్రా. 14 కం)
        "ఏతద్ విష్ణో: క్రాప్తం తేనహై తేన భరతో దౌ:ష్యన్తి రీజే"
         (కాణ్వ శతపథ 139 కాండము. 39 అధ్యా. 4 బ్రాహ్మణము 12 కం.)

"నాలపిత్య" మనెడి కణ్వాశ్రమమునకు చెందిన అప్సర యగు శకుంతల దుష్యంతునివలన భరతుని కనెను. పిమ్మట భరతుడు భారతవర్షము నంతను జయించి వేయి అశ్చమేధ యాగముల నింద్రుని గుఱించి చేసెను. దీనివలన కణ్వాశ్రమమునకు "నాలపిత్య" మను పేరుండినట్లు తెలియుచున్నది. శుక్ల యజు ర్వేదమునకు చెందిన 'మాధ్యందిన' శాఖవారు ఉత్తర హిందూస్థానమున విశేషముగా గలరు. పర్యవసాన మేమన కణ్వాశ్రమము ఆంధ్రదేశమున గల కణ్వనదీ తీరమున గలదు.