పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75. రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మానవ వనరులు పెంపొందించే దిశగా చేపట్టవలసిన శిక్షణా కార్యక్రమాలను గుర్తించటం కోసం ప్రభుత్వం ఒక సమగ్ర విశ్లేషణను చేపట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పబడుతున్న వివిధ పరిశ్రమలకు నిపుణులైన కార్మిక శక్తిని సమకూర్చడంతో పాటు, స్థానికులకు ఉద్యోగ అవకాశాల కల్పనను మరింత మెరుగు పరచడం సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ కాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్ / ఫ్యాక్టరీస్ యాక్ట్, 2019' ని తీసుకొచ్చింది. దీని ద్వారా పరిశ్రమలలో 75% ఉద్యోగాలు స్థానికులకే చెందుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొల్పిన, రానున్న రోజుల్లో నెలకొల్పనున్న పరిశ్రమలు తమ ఉద్యోగాల్లో 75% స్థానికులకు ఇవ్వడం తప్పనిసరి. రాష్ట్రంలో తిరుపతిలో ఒక స్కిల్స్ విశ్వవిద్యాలయంతో పాటు, 30 స్కిల్ కళాశాలలు కూడా నెలకొల్పాలని ప్రతిపాదించడమైనది. ఈ కళాశాలలు ప్రతి ఒక్క పార్లమెంటు నియోజక వర్గంలోనూ ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటవుతాయి. వీటితో పాటు 4 ట్రిపుల్ ఐటిల్లోనూ, పులివెందుల లోని జె.ఎన్.టి.యూ.లోనూ కూడా స్కిల్ కళాశాలలు నెలకొల్పబడతాయి. ఈ కార్యక్రమాల నిమిత్తం ఈ రంగానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.856.62 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

గ్రామీణాభివృద్ధి

76. గ్రామీణ ప్రాంతాలలో ప్రతీ ఒక్క కుటుంబానికి ఉపాధిహామీ కింద మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొత్తం 13 జిల్లాలలోనూ అమలవుతున్నది. గ్రామీణ నిరుపేదలకు జీవనోపాధిని నిలకడగా సమకూర్చేందుకూ, చిరకాలం ఉండిపోయే గ్రామీణ సంపదను సృష్టించేందుకూ ప్రభుత్వం ఈ పథకాన్ని వివిధ శాఖలతో అనుసంధాన పరచి అమలు చేస్తున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 42.35 లక్షల కుటుంబాలకు చెందిన 69.14 లక్షల వేతన ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశం కలిగింది. వీరందరూ కలిసి 1679.68 లక్షల పని దినాల మేరకు పనులు చేపట్టారు. ఇందులో షెడ్యూల్డు కులాలకు సంబంధించిన వారికి 362.74 లక్షల పని దినాలు, షెడ్యూల్డు తెగలకు 190.27

30