పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్షల పని దినాలు, వెనుకబడిన తరగతులకు 831.34 లక్షల పని దినాలు లభించాయి. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారిలో 96.14% మందికి 15 రోజుల్లోనే చెల్లింపులు జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల అనుసంధానంతో వస్తు సామగ్రి విభాగం కింద ఈ పథకం ద్వారా రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. తద్వారా క్షేత్ర స్థాయిలో పాలనా పద్ధతులు మరింత బలోపేతం కానున్నాయి.

77. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామీణాభివృద్ధి కింద రూ.16,710.38 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

పట్టణాభివృద్ధి

78. ఒక రాష్ట్రం సాధించే ఆర్థిక పురోగతికి ఆ రాష్ట్రంలోని పట్టణ పాలన ఒక ముఖ్యమైన కొలమానం. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ద్వారా అందే మొత్తం 110 పౌర సేవల్ని వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందించడం జరుగుతున్నది. తద్వారా సమర్థవంతమైన, పారదర్శకమైన, జవాబుదారీ తనం కలిగిన పాలన సాధ్యపడుతున్నది. ఈ సేవల నిమిత్తం 2019-20లో 35 వేల మందికి పైగా వార్డు సచివాలయ సిబ్బంది, 70 వేల మందికి పైగా వార్డు వాలంటీర్లను నియమించటం జరిగింది.

79. అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థల పరిధిలోనూ రక్షిత మంచినీటి సరఫరాను అందించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఇందుకు గాను ప్రస్తుతం ఉన్న సదుపాయాలను మెరుగుపరచడం, సేవల నాణ్యతను పెంపొందించడం మీద దృష్టి పెడుతున్నది. అమృత్, యు.ఐ. డి.ఎస్.ఎస్.ఎం.టి. పథకాలతో అనుసంధాన పరచడం ద్వారా ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు, హడ్కోల ద్వారా, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో భూ గర్భ డ్రైనేజికి, మురుగునీటి ప్రక్షాళనకు, రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధిచిన ప్రాజెక్టులను ప్రభుత్వం అమలు పరుస్తున్నది.

31