పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

.

ఆత్మకధ

కన్నడ మూలం: డా.చంద్రప్ప సొబటి; తెలుగుసేత: రంగనాథ రామచంద్రరావు 90597 79289

కొయ్యబొమ్మలాట కళాకారుడు

గొంబేగౌడరరామనగౌడ



కళాబండి మొదటి ప్రయాణం

నాకు అప్పుడు పదమూడేళ్ళు.

ఆట ఆడటానికి నాన్న తన మేళంతోపాటు తీసుకుని పోతానని చెప్పారు.

అప్పుడు నాకు పట్టరాని సంతోషం కలిగింది.

ఆ నాటి రోజుల్లో మేము మా ఊరు వదిలి మరో ఊరికి వెళ్ళడమంటే అంత సులభం కాదు.

అదీ ఆటాడటానికి మరో ఊరికి వెళ్ళమంటే సామాన్య విషయం కాదు.

అందువల్లనే చాలా సంతోషం కలిగింది.

అయితే ఆ రోజు కళాకారుడిలా వారితో వెళ్ళలేదు.

అందుకు బదులుగా ఎద్దుల బండిని బాడుగకు తోలేవాడిగా వెళ్ళాను. అంటే నాన్న మేళం బొమ్మలాటకు వాడుతున్న బొమ్మలను, వాయిద్యాలను, ఆట ప్రదర్శనకు వేదికను నిర్మించటానికి కావలసిన సామానులను వేసుకుని, అలాగే కళాకారులను ఎద్దులబండిలో ఎక్కించుకుని తోలేవాడిని. అదీ బాడుగకు!ఇదొక విచిత్రమైన విషయంగా అనిపించవచ్చుకదా !

వంశపారంపర్యంగా వచ్చిన కళ !

నాన్ననే మేళం నాయకుడు.

అలాంటి నాయకుడి కొడుకు బండి తోలుతూ సంపాదించడం నిజం.

సుమారు నాలుగైదు సంవత్సరాలు ఈ పని చేశాను.

ఆ అనుభవం ఉపయోగపడింది. కేవలం బాడుగదారుడిగా ఈ పని చేయలేదు.

ఆ సమయంలో బొమ్మలను ఎలా ఆడించాలో నేర్చుకున్నాను. ఆట ప్రదర్శనలో అప్పుడప్పుడు చిన్న ప్రమాణంలో భాగం వహించేవాడిని. అయితే మేళం వారికి నేనాక బాడుగకు బండి తోలేవాడిని మాత్రమే.

అందువల్ల బండి బాడుగ సొమ్ము తప్ప మరే సంభావన ఇచ్చేవాళ్ళు కాదు.

మొదట్లో బండి బాడుగ అని రోజుకు అయిదు రూపాయలు ఇచ్చేవారు. కొన్ని నెలలు గడిచిన తరువాత, ఆ బాడుగ ఒక ఊరిలో ప్రదర్శించే ఒక ఆటకు పది రూపాయలుగా మారింది. ఈ మార్పు ఒకే ఊళ్ళో, అది ఒకే 'అట్ట 'లో ('అట్ట ' అంటే వేదిక) రెండు ఆటలు లేదా ఒకే ఊళ్ళో రెండు 'అట్ట 'ల్లో రోజుకు రెండు ఆటలు ప్రదర్శించేవారు. అంతేకాకుండా ఒక్కో రోజు రెండు ఊళ్ళల్లోనూ ఒక్కో ఆట ప్రదర్శించేవారు. ఒక ఊళ్ళో సాయంకాలం సుమారు ఆరు నుంచి ఎనిమిదిన్నర- తొమ్మిది వరకు ఆట ఆడితే, మరో ఊళ్ళో సుమారు రాత్రి తొమ్మిదిన్నర -పది నుంచి ఉదయం అయిదున్నర-ఆరు గంటల వరకు ఆట సాగుతూ ఉండేది. అలాంటి సందర్భంలో నాకు చాలా అలసట కలిగేది. కళాకారులు భోజనం చేసి, సిద్దమయ్యేలోపు బండిలో ఉన్న సామానులను ఆట జరిగే స్థలంలో చేర్చాలి. ఆట జరిగే వేదిక- బండి నిలబడ్డ స్థలానికి సమీపంలో ఉన్నా తొందరగా మోసుకొచ్చి, వేదిక నిర్మాణానికి సిద్ధం చేయాలి. లేకపోతే నాన్న చెడామడా తిట్టేవారు. ఎన్నోసార్లు నాన్న మేళంవారి ముందు, ఊరి జనం ముందు తిట్టేవారు. ఊరికే తిట్టడం ఆయన అభిప్రాయంకాదు. ఆట సమయంలో చూపే సోమరితనాన్ని ఆయన ఎన్నడూ సహించేవారు కాదు. అలా తిట్టించుకుంటూ ఆట ప్రదర్శనకు అన్నీ సిద్ధం చేస్తుండేవాడిని. అలాంటి రోజున నాకూ, ఎద్దులకూ అలసట కలిగేది.

ఇది అర్థం చేసుకున్న మేళంవారు ఆటకు పదిరూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేశారు.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. మేళంవారు ఆటకు పదిరూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసినపుడు, నాన్న వ్యతిరేకించారు. రోజుకు అయిదు రూపాయలు చాలని మొండిగా పట్టుబట్టారు. ఒకటి రెండు రోజులు మేళంవారికి, నాన్నకు మధ్యన చిన్నవాదన జరిగింది.

నాన్న మొదట తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళుతున్నప్పుడు ఆట ప్రదర్శనకు తీసుకునే డబ్బు, ఆటలో వచ్చే ముయ్యి, మొదలైన ఖర్చుల ఆధారంగా బండిలో లెక్కాచారం జరిగేది. అప్పుడు నా బండిబాడుగ విషయమూ వచ్చేది.

ఆ సందర్భంలోనూ నాన్న రోజుకు అయిదురూపాయలు చాలనే వాదననే కొనసాగించారు.

బండి తోలుతూనే ఈ వాదప్రతివాదాలను వింటున్న నేను అయోమయంలో పడ్డాను.

మనస్సుల్లోనే కోపగించుకోసాగాను. ఎందుకంటే ఆ విషయం గురించి నాన్నతోకానీ, మేళంవారితోకానీ సూటిగా నేనేమీ చెప్పలేను. నాన్న తీసుకున్న నిర్ణయానికి ఎదురుజవాబు ఇవ్వాలంటే భయం. మాటకు మాట, వాదానికి వాదం చేసేవారిని, అందులోనూ పెద్దవారి ముందు మాట్లాడటం ఆయన భరించేవారు కాదు.ఆ సమయంలో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

42