పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోవడం వల్ల, ఖాళీగా పడివుండడంవల్ల అది అన్ని విధాలా నష్టమయి ఫోతోంది, నిరర్ధకమైపోతోంది. ఎఫ్‌.ఏ లేదా ఎంట్రన్స్‌ల వరకు మన నమయం కేవలం కనీస వ్యవహారానికి సరిపడే ఆంగ్లాన్ని నేర్చుకోవడంలో గడచిపోతోంది. దీని తరువాత బి.ఏలో ఒక్కసారిగా మన ముందు పెద్ద పెద్ద పుస్తకాలు, అవసరమైన, ఆలోచించదగ్గ విషయాలు ఉంచుతారు. అప్పుడు వాటిని అవగాహన చేసుకునేందుకు సమయం కాని, యోగ్యతకాని వుండవు. మరేమీ చేయలేక, అసహాయత వల్ల అవ్వన్నీ పెద్ద ఉండచేసుకుని ఒకే ముద్దలో మింగవలసి వస్తోంది.

మనం చదువుకుంటూపోతామే కాని దానితో పాటు ఆలోచించం, అర్థం చేసుకోం. యిటుకలు, సున్నం గుట్ట పెంచుకుంటూ పోవడమే కాని వాటిని ఉపయోగించడం మనకు తెలియదు. ఎండలో, వర్షంలో ఆశ్రయాన్ని విశ్రాంతినిచ్చే నివాస గృహాలుగా వాటిని మన స్వబుద్దితో తయారు చేసుకోవటం లేదు. యీ విధంగా యిటుకలు, సున్నం, సిమెంట్‌, స్తంభాలు, ఇనుము మొదలైన వాటి గుట్టలు పర్వతాలుగా పెరుగుతూ పోతాయి. అప్పుడు ఒక మహ విద్యాలయం నుంచో, విశ్వవిద్యాలయం నుంచో ఒక మూడు అంతస్తుల యింటికి కప్పు కట్టమని ఆదేశం వస్తుంది. యింకేముంది, ఆ ఆదేశాన్ని పాటించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఎలాగో ఆ గుట్టనెక్కి రెండు సంవత్సరాలలో దాన్ని కొట్టి, కొట్టి పై భాగాన్నీ సమతలంగా చేస్తారు. ఆ గుట్ట కప్పులాగా తయారవగానే అదుగో మూడు అంత స్తుల ఇల్లు తయారయ్యిందనీ చెబుతారు. కానీ అది భవ్యమైన భవనం అవుతుందా? గాలి, వెలుతురు తగినంతగా రావడానికి ఏమైనా మార్గం వుందా? ఏ వ్యక్తి అయినా ఆ భవనంలో కొద్దిసేపు వుండ గలుగుతాడా? తీక్షణమైన ఎండ నుండి, ప్రచండ వాయువుల నుండి, వర్షం నుండి ఆ భవనం మనని రక్షించగలుగుతుందా? ఈ నిర్మాణంలో నైపుణ్యం కానీ, సౌందర్యం కానీ ఉన్నాయా?

గుట్టల్లాగా ఇప్పటిదాకా పోగుచేసిన సామగ్రి చాలు. మనస్సనే భవనాన్ని నిర్మించటానీకి యీ ఇటుకలు, సున్నం, యిసుక, సిమెంట్‌ మొదలయినవి మనకు యింతకు ముందు లభ్యమయ్య్యేవి కావు. కానీ యివి పోగుచేసినంత మాత్రాన నిర్మించవచ్చుననుకోవటం పొరపాటు. వాస్తవానికి సామగ్రితో పాటు భవన నిర్మాణం కూడా జరిగితే సామగ్రి ఉపయోగపడడమే కాక పనికూడా దృఢంగా, పక్కాగా జరుగుతుంది. కానీ మన దేశంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. మనిషి ఒక వైపునకు సాగితే అతని విద్య మరొక వైపునకు సాగుతోంది. ఒకవైపు పెట్టుకోవడానికి చోటు లేనంతగా తిండి పదార్థాలు పెరుగుతున్నాయి, అకలీ పెరుగుతోంది, కడుపు తన తాపంతో మండుతూనే వుంది. యీ రకంగా మన దేశంలో చిత్రమైన తమాషా జరుగుతోంది.

అందువల్లనే మీరు మీ పిల్లలను మనుషులుగా తీర్చిదిద్దాలను కుంటే బాల్యం నుండీ అ రకమైన ప్రయత్నమే చేయండి. లేదా వారు ఎప్పటికీ పిల్లలుగానే వుండిపోతారు, మనుషులు కాలేరు. బాల్యం నుండి వారి స్మరణ శక్తి మీదే భారం మోపకుండా వారి అలోచనా శక్తి అధ్యయన శక్తి కూడా పెరగటానికి అవకాశమివ్వండి. విత్తు నాటడానికి భూమిని అనుకూలంగా చేయాలంటే కేవలం దున్ని రాళ్ళు రప్పలు ఏరి చదునుచేస్తే చాలదు. అదే విధంగా యీ విలువైన భూమిని సారవంతంగా చేయాలంటే కేవలం బట్టీ పట్టడం, పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వడమే చాలదు. యీ ఎండుమట్టితోపాటు, యీ నిరంతరం దున్నటంతో పాటు కొంతసారం కూడా వుండాలి. మట్టిలో సారం ఎంతుంటే ఆహార పదార్థాలు అంత బాగుంటాయి. యిదేకాక కొన్ని సమయాల్లో భూమికి వర్షం కూడా అవసరం. సమయం దాటిన తరువాత ఎంత వర్షించినా లాభం వుండదు. యవ్వనంలో జీవితాన్ని రసమయం చేసుకోవటానికి, సంస్కరించు కోవడానికి ఆలోచనాశక్తి ఎంతో అవనరం. సాహసోపేతమైన ఆలోచనలు, నిర్ణయాల ప్రభావం ఎంతో వుంటుంది. ఆ సమయంలో సాహిత్యాకాశం నుండి వర్షం కురిస్తే పని సిద్దిస్తుంది.

మనస్సు అప్పుడవ్వుడే మేల్మొని మాతృభూమిని దాటి యీ విశాల ధరిత్రిని అనంత ఆకాశాన్ని దర్శించినప్పుడు, బాహ్య ప్రపం చంతో అప్పుడే కొత్త కలయిక జరుగుతున్నప్పుడు, కొత్త కొత్త లక్షణాలు ఉబికే ప్రేమ, ఎగిసే కోరికలు నాలుగు వైపులనుండీ చుట్టు ముట్టి నపుడు, ఆలోచనలనే సుఖకరమైన వాయువులు ప్రసరిస్తున్నపుడు, శాశ్వతమైన ప్రసన్నత ఒడిలో వెలుగు, శాశ్వత ఆశీర్వచనాల కెరటాలు ప్రవహిస్తున్నపుడు ఆ విత్తనాల రెక్కలు జీవితమంతా సఫలమ్టై ఆనందాన్ని సంపూర్ణతను సంతరించుకొంటాయి. కానీ అదే సమయంలో ఎండిన మట్టితో, వేడి వేడి యిసుకతో కప్పివేస్తే ఆనంద రహితమైన పదావళిని, వర్ణమాలను వల్లించటం కంటే మరో పని లేనప్పుడు దాని తరువాత ఎంత వర్షించినా - సమస్త ఐరోపా ఆధునిక, సాహసోపేతమైన ఉదాత్త భావాలు ఎంత వర్షించినా-తగినంత సఫలత ఎంతమాత్రం కలగదు. సాహిత్యంలోని జీవశక్తి వారి జీవితాలపై కొద్దిగానైనా వెలుగును ప్రసరించలేదు.

కానీ మన అనందరహిత్క నీరసమైన, నిర్జీవమైన విద్యవల్ల అ జీవదాయక శక్తి వ్యర్థమయిపోతుంది. కొద్దిపాటి వల్లె వేసిన విషయాల బరువును మోసుకుంటూ మనం బాల్యం నుండి యవ్వనం లోకి ప్రవేశిస్తాం. బట్టే పట్టడంలోనే మన మనసులు విరిగిపోతాయి. యింత చేసినా మన మానవత బాగా పుష్పించి ఫలించదు. మనం ఆంగ్లభావభూమిలో ప్రవేశించినప్పుడు అక్కడ కూడా చక్కగా ఆట పాటలలో విహరించలేం. భావాలని మనం అర్ధం చేసుకున్నా మనసులో వాటిని ముద్రించుకోలేం. వాటిని మాటి మాటికి వల్లెవేస్తూ వుంటాం కానీ మన వాస్తవ జీవితంలో వాటిని ప్రయోగించలేం. అవి మన వెలుపలనే వుండిపోతాయి, లోపలికి చొచ్చుకోవు. మన మనస్సుతో వాటికి ఎటువంటి సంబంధమూ, సంపర్మమూ వుండదు.

యీ విధంగా 20, 22 సంవత్సరాల వరకు ఏ భావాలు నేర్చుకుంటామో వాటికి మన జీవితంతో ఏ విధమైన రసాయనిక సంయోగమూ సిద్ధించదు. దానివల్ల మన మనసు ఒక విచిత్రమైన రూపాన్ని దిద్దుకుంటుంది. ఆ విధంగా నేర్చుకున్న భావాలు బయట అంటించుకున్నట్లు వుంటాయి. కొన్ని అనతి కాలంలోనే ఎగిరిపోతాయి.

ఆటవికులు తమ శరీరాలకు రంగు రంగుల బొమ్మలు గీసుకునీ తమ సహజ సౌందర్యాన్ని మెరుగు పరచి, యీ కృత్రిమ సౌందర్యానికి గర్వపడుతూ వుంటారు. అదే విధంగా మనం యీ విదేశీ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

15