పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంగ్ల భాషావపదాలతో కలవవు. వారి భావాలు, అలోచనలు, విషయాలు విదేశీయమే. వారి విషయాలలో మనం అనఖిజ్ఞులం. మన ఆలోచనాశక్తి పుట్టకముందే వారి విషయాలన్నీ కంఠస్థం చేసే అగత్యం ఏర్పడుతోంది. అందుకనే అన్నం నమలకుండానే మింగేసేవాడి లాగా మన స్థితి ఉంది. ఉదాహరణకు ఒక ఆంగ్ల బాలుడు తన పాఠ్య పుస్తకంలో- పచ్చిగడ్డిని ఎండబెట్టి పశువుల చొప్ప తయారు చేయటం అనే అంశంపై ఒక కథ చదివితే చాలా ఆనందం పొందుతాడు. దాన్ని గురించి వాడికి బాగా తెలుసు. అదే విధంగా ఆంగ్ల బాలబాలికలు మంచు ముద్దలు అనే పాఠంలో ఛార్లీ కేటీల మధ్య సంభాషణని చాలా యిష్టంగా చదివి ఆనందిస్తారు. కానీ మన పిల్లలు ఒక విదేశీ భాషలో చదివితే వారికెటువంటి ఆనందమూ కలగదు. పైన ఉదహరించిన అంశాల గురించి వారి మనస్సులో ఎటువంటి భావాలూ కలగవు. వారి మనస్సులపై ఎటువంటి చిత్రమూ ఏర్పడదు. కళ్ళులేని వారి మాదిరి తడుముకుంటూ నడువవలసి వస్తుంది.

ప్రాథమిక తరగతులలో చదువు నేర్పే ఉపాధ్యాయులు కొందరు ఎంట్రన్స్‌ పాసయి వుంటారు. తక్క్మినవారు ఎంట్రన్స్‌ ఫెయిలయి వుంటారు. ఆంగ్లభాష, సభ్యత, ఆలోచన, ఆచార విచారాలతో వారికి చక్మ్కని పరిచయం వుండదు. పిల్లలకు మొట్టమొదటగా యిటువంటి వారే ఆంగ్లభాషను పరిచయం చేస్తారు. వీరికి మాతృభాష పూర్తిగా రాదు, అటు ఆంగ్ల భాషా రాదు. వీరు పిల్లలకి నేర్చటానికి బదులు ఉన్నది పోగొట్టడంలో సఫలీకృతమవుతారు!

కానీ పాపం యిందులో వీరి దోషమేముంది? “Horse is a noble animal" యీ వాక్యం ఆంగ్లంలో అతి సాధారణ వాక్యం. దీనిని మన భాషలోకి అనువదిస్తే బాగా రాదు సరికదా ఆంగ్లంలోని అర్ధం కూడా వికృతమైపోతుంది. గుర్రం ఒక గొప్ప జంతువు - గుర్రం ఒక ఉత్తమశ్రేణి జంతువు - గుర్రం మంచి జంతువు: ఏ విధంగా అనువదించినా రావలసినంతగా సరియైన అర్ధం రాదు. అధ్యాపకుడు అటువంటి సమయంలో ఏదో మసిపూసి మారేడుకాయ చేయక తప్పుదు. ప్రాథమిక స్థాయి ఆంగ్లబోధనలో ఎన్నోసార్లు యీ విధమైన గందరగోళం ఏర్పడుతూనే వుంటుంది. యీ స్థాయిలో నేర్పే ఆంగ్లం అతి సాధారణమైనదిగానూ, అస్పష్టంగానూ వుంటుంది. దీనిని అభ్యసించడంలో పిల్లలు రసాస్వాదన చేయలేరు. కానీ పిల్లలు అనందాన్ని పొందాలని ఎవ్వరూ ఆశించటం లేదు. ఉపాధ్యాయులు, విద్యార్థులూ చెప్పేదేమంటే మాకు రసంతో సంబంధం లేదు. ఏదో విధంగా అర్థం లాగితే పని జరిగిపోతుంది, పీడ వదులుతుంది. పరీక్షలో ఉత్తీర్ణులవటంతోనే నౌకరీ సిద్దంగా వుంటుంది.

యిక పిల్లల అద్బష్టంలో మిగిలినదేముంది? వారు మాతృభాష నేర్చుకుంటే కనీసం రామాయణాది మహా కావ్యాలన్నా చదువుకొని వుండేవారు. ఏమీ నేర్చుకోకపోతే కనీనం ఆటపాటలకయినా సమయం దొరికేది. చెట్లెక్కి యీతకాట్టి, పువ్వులేరుకొని, ప్రకృతిలో వేల ఆటలు ఆడి మానసిక ఉల్లాసాన్ని శాంతిని పొందగలిగేవారు. యీ ఆంగ్లభాషాభ్యాసంలో తలమునకలవ్వడం వల్ల అటు చదువు లేదు, యిటు ఆటలేదు. ప్రకృతి వాస్తవిక సామ్రాజ్యంలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతున్నారు, కావ్యానందానికి దూరమవుతున్నారు.


మన తోవలో (మనసులో) బయట కూడా తిరగటానికి విశాలమైన మైదానాలున్నాయి. ఆ మైదానాల్లో మనం ప్రాణశక్తిని, స్వస్థత అనే అమూల్య సంపదను పొందగలుగుతాం. అక్కడనుండే రకరకాల రంగులు, రకరకాల చిత్రాలు, ఆక్బతులు, భావాలు, సుఖసంతోషాలు పైకెగసి మన శారీరక, బౌద్దిక వికాసానికి దోహదం చేస్తాయి. అయ్యో! అభాగ్యులైన యీ పిల్లలు బాహ్య, అంతఃకరణాలనే తల్లిదండ్రుల ప్రేమకు నోచక విదేశీ బందీ గృహాలలో, సంకెళ్ళతో ఖైదీలవుతున్నారు. భగవంతుడు తల్లిదండ్రుల మనసులో ప్రేమ తరంగాలను సృష్టించి తల్లి ఒడిని రసవంతం చేశాడు. కానీ వారి పిల్లలు పసితనంలోనే తమ అమూల్య సమయాన్ని ఒక విదేశీ భాష వర్ణమాలను, పదకోశాన్ని గుర్తు పెట్టుకోవటంలో నష్టం చేసుకోవలసి వస్తోంది. దీనిలో జీవం లేదు. ఆనందానుభూతి లేదు. కొత్త విషయమూ లేదు. యిటూ అటూ కదలడానికి అవగింజంత చోటూ లేదు. వర్ణమాల, పదకోశం లోని నీరసమైన, కుళ్ళిన, రుచి రహితమైన ఎముకలు నమలటం వల్ల వీల్లల మనసు, మస్తిష్కం వికాసాన్ని పొందగలవా? వారిలో విశిష్టమైన యోగ్యత పెంపొంద గలదా? వారి శీలం నిర్మలంగా, దృఢంగా కాగలదా? పెద్దవారైనా కూడా తమ స్వబుద్దితో ఏదైనా పని చేయగలరా? తమ స్వశక్తితో ప్రగతి నిరోధక అటంకాలను దూరం చేసుకోగలరా? తమ సహజ తేజంతో ప్రతి స్థితిలోనూ తల ఎత్తుకుని ఉండగలరా? యీ బక్కచిక్కి పాలిపోంయిన ముఖాలుగల వీరు, సాహనహీనులైన బాలలు బతికుండగా మృత్యువును తప్పించుకోగలరా? లేదు. కేవలం అనుకరించడం, కంఠస్థం చేయడం, లేదా బానిసత్వం మాత్రమే వారు నేర్చుకోగలరు.

ఒక్కసారిగా ఏ పిల్లవాడు యువకునిగా మారలేదు. బాల్యావస్థనుండి మార్చు చెందుతూ కొద్దికాలం తరువాత యౌవ్వనంలోకి ఆడుగుపెదతారు. ఆలోచనాశక్తి, అధ్యయనశక్తి యీ రెండు అమూల్యమైన వస్తువులు - జీవిజానికి ఆశ్రయమిచ్చి రక్షించేవి యివే. యవ్వనంలో ఒక్కసారిగా యీ శక్తుల పనిపడ్డప్పుడు, కోరుకోగానే మనఎదురుగా వచ్చి నిల్పోవు - మన కాళ్ళు, చేతుల మాదిరి మన జీవితంతోపాటు క్రమంగా పెరుగుతూ వుంటాయి. అవేమీ ముందుగా తయారుచేసి పెట్టిన వస్తువులు కావు - కావలసినప్పుడు, మనస్సు పుట్టినప్పుడు బజారులో కొనుక్కోడానికి. ఆలోచనాశక్తి అధ్యయనశక్తి రెండూ జీవనయాత్రకు లాభదాయకమైనవి, అత్యావశ్యకమైనవి అని చెప్పటంలో నందేహం లేదు. యీ రెండు శక్తులు లేకుండా మానవులుగా తయారవ్వడం, మనుషత్వాన్ని పొందటం ఎంతమాత్రం సాధ్యంకాదు. బాల్యం నుండి యీ శక్తులను పెంపొందించకపోతే అ అవసరం కలిగినప్పుడు మనకు లభ్యం కావు,

కానీ మన వర్తమాన బోధన ప్రణాళికలో యీ శక్తులు పెరగటానికి మార్గం బహుశా పూర్తిగా మూసివేసి ఉంది. అంగ్రభాష అతి కఠినమైన విదేశీ భాష అని ముందే చెప్పాను. మన ఉపాధ్యాయులలో యోగ్యత ఎంత తక్కువ అంటే వారి మనస్సులో ఆంగ్ల పదజాలంతో పాటు దానికి సంబంధించిన భావాలు కలగవు. అందువల్లనే ఆంగ్ల భావాన్ని అర్థం చేసుకోటానికి మన అమూల్యమైన సమయాన్ని నష్ట పరచవలసి వస్తోంది. అంతవరకు మన ఆలోచనశక్తికి పనిలేక

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

14