పుట:అక్షరశిల్పులు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివిధ దినపత్రికల జిల్లా ఎడిషన్‌లలో కూడ ప్రకటన విడుదల చేయించాను. ఈ ప్రకటన రాష్ట్రంలోని 13 జిల్లాలలోని అన్ని దినపత్రికల జిల్లా ఎడిషన్లలో ప్రచురితం కావడమే కాకుండ ఆయా ప్రాంతాల నుండి వెలువడుతున్నప్రాంతీయ పత్రికలలో కూడ ప్రచురితమై నా ప్రయత్నానికి బహుళ ప్రచారం కల్పించింది. ఆ ప్రయత్నానికి అంతటితో ఆపకుండ నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి స్వయంగా తెలియజేశాను, లేఖలు రాశాను. దూరవాణి, సంచారవాణి ద్వారా విషయం తెలుపుతూ వివరాలను కోరాను. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న మిత్రుల ద్వారా కూడ ఈ విషయాన్ని కవులు, రచయితలకు తెలియపర్చే ప్రయత్నం చేశాను.

ప్రతిస్పందన

ఈ ప్రయత్నంలో భాగంగా, మార్చి 2008లో ఆరంభించిన సమాచార సేకరణ కార్యక్రమాన్ని 2010 మార్చి చివరి వరకు సాగించాను. ఈ ప్రయత్నంలో భాగంగా కవులు, రచయితలను తమ వివరాలు పంపాల్సిందిగా పలుమార్లు కోరాను. 'అక్షరశిల్పులు' గ్రంథాన్ని వెలువరిస్తున్న విషయం 'ఇండియా' మాసపత్రికలో వరుసగా 2010 ఫిబ్రవరి వరకు ప్రతి మాసం ప్రకటిస్తూ రావడం వలన విషయం తెలుసుకున్నచాలా మంది 'ప్రొఫార్మా' లో నిర్దేశించిన విధంగా తమ సమాచారాన్ని, ఫొటోలను, తమ రచనలను, గ్రంథాలను పంపించారు. ఈ విధంగా 2010 ఏప్రిల్‌ చివరి వారం వరకు కూడ పంపుతూ వచ్చారు. అతి కొద్దిమంది మాత్రం వారి సమాచారం కోరిన ప్రతిసారి పంపుతామని చెబుతూ వచ్చినా, చివరికి పంపలేదు. ఈ విధంగా కొందరు పంపకపోయినా అత్యధికులు సానుకూలంగా ప్రతిస్పందిస్తూ సహకరించడం వలన 'అక్షరశిల్పులు' 2010 ఏప్రిల్‌ మాసాంతానికి పూర్తి చేయగలిగాను.

రూపకల్పనకు అనునసరించిన విధానం

అక్షరశిల్పులు రూపకల్పన విధివిధానాల గురించి పలువురు సాహిత్యవేత్తలను సంప్రదించాను, మిత్రులతో చర్చించాను. ఈ విషయమై చాలా మందితో తర్జనభర్జనలు చేశాను. పర్యవసానంగా వెల్లడైన అభిప్రాయాలు పెద్దలు చేసిన సూచనలు, సలహాలను పాటిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం ప్రకారంగా, వివిధాంశాల మీద గ్రంథాలు ప్రచురించిన కవులు, రచయితలు, అనువాదాకులతో పాటుగా రాష్ట్రంలో వెలువడుతున్న తెలుగు పత్రికల్లో, కవితా సంకలనాలో కనీసం ఐదు (కవితలు, కథానికలు, కథాలు, వ్యాసాలు) రచనలు ప్రచురితమైఉన్న వారి వివరాలను మాత్రమే పొందుపర్చాలని నిర్ణయించడమైనది. ఆ తరువాత పాటలు, నాటికలు, నాటకాలు రాసిన రచయితలను కూడ పరిగణలోకి