పుట:Varavikrayamu -1921.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

వరవిక్రయము

టీచ :- మహానుభావులు:- దైవస్వరూపులు మన్నించాలి.

వెంగ :- ఫయినన్నా కదల్లేదు గనుక పదిహేను రోజులు సస్పెండు.

టీచ :- అధికార్లు ఆగ్రహపడితే నే నాగలేను. అనుగ్రహించాలి.

వెంగ :- సస్పెండన్నా జంకావు కావు కనుక డిస్మిస్‌ చేశాను ఫో.

టీచ :- ఆరి ఛండాలుడా! ఆ మాటకూడా అనేశావా; సరే ఇంతేనా యింకేమయినా చెయ్యగలవా? ఈ మూడేళ్ళముష్టి పదివిపోగానేఁ ఇంటింటా అడుక్కుతినే యోగం నీకుగాని యీపాటి కాటికాపరి పని మాకు దొరకకపోదు. అదిగాక నీవంటి అధమాధముని కాలంలో, అడలిపోతూ నవుకరీ చెయ్యడం కంటే యాయవార మెత్తుకున్నా మంచిదే. శేషాద్రిగారి చెప్పులుమోసి, కామరాజుగారికి కాళ్ళు గుద్ది మాలవాడికి వంటింటిలో మంచంవేసి వారికీ సాధ్యంకాని ఓట్లకు వందలకు వందలు సమర్పించీ, ఈ సామ్రాజ్యం సంపాదించావు! అయితే యేమీ ఆ పడ్డపాట్లన్నీ అప్పుడే దులిపేశావు! అల్పున కధికారం పట్టినా, ఆడదానికి వైధవ్యము వచ్చినా "యెద్దు కచ్చుపోసినా, యేనాదికి పెత్తనమిచ్చినా, క్షణంలో స్వరం మారుతుందన్న వాఁడు వెఱ్ఱివాఁడా! ఏమి విపరీతకాలం వచ్చిందో! యెక్కడ చూచినా మునిసిపాలిటీలూ, లోకల్ బోర్డులూ, నిరక్షరక్షులతోనో, నీవంటి నీచాతినీచులతోనో నిండిపోతున్నాయి! అయిందాకా, అడ్డమైన గడ్డి కరవడం! అయిందనగానే, ఆకాశం ముట్టడం! యిదీ యిప్పటి మర్యాద! అయినా, మీ యాపదమ్రొక్కులు నమ్మి మీలాంటి వాళ్ళకు వోట్లిచ్చేవారి ననాలి గాని మిమ్ముల నవలసిన పనిలేదు! మీకు వోట్లివ్వడం వలన మీపాపాలలో భాగం పంచుకోవలసివుంటుందన్న సంగతి తెలిస్తే ఒకరయినా మీకు వోటిస్తారా? నీకూ కాలం దగ్గిర పడ్డది! కాకపోతే, కళ్ళింత మూసుకుపోవు! ఇనస్పెక్టరుగారిమీద నీకింత కడుపుమంటెందుకు? నీతో గలిసి నీ పాటకు తాళం వేశారు కారనేనా? ఆయన చెప్పులు మొయ్యడానికయినా నీ కర్హత వున్నదా? నీవు చేసిన దారుణాలకు, నీ గుండెలలో గునపం లాగు ఆ మహారాజు కాస్త అండగా వుండబట్టే, యింత అన్నం తిన్నాం! ప్రతివారిని పిడత పిడతంటావు! పిడతేమిటి? నీ పిండాకూడు! ఎంతమంది నీ జీవానికి పడి యేడ్చు