పుట:Varavikrayamu -1921.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్ఠమాంకము

81


వూడిపడేసేరికి చుక్కలు రాల్తాయి. పయివాళ్ళను తగ్గించి, బంధువులను తెచ్చిపెట్టుకోవడం మొదలు పెట్టాక అది అఘోరంగానే వుంది! ఈ కాకిపిండాలయినా ముట్టకుండా స్వరాజ్య పార్టీవా రిక్కడ కూడా సన్నాహాలు మొదలుపెట్టారు. ఎలక్షను రోజులు దగ్గిర పడుతున్నాయి! వెనుకటిలాగే ఓట్లు కొందామంటే వెనుకటి ఋణమే యిప్పటికింకా తీరలేదు. బాగా వచ్చేటప్పుడు వొల్లు తెలియక బ్రాంది దగ్గరనుంచి అలవాటు చేసుకున్నాను. ప్రాతఃకాల మయ్యేసరికి బాటిల్‌ కావాలి. ఈ తిప్పలకు తోడు యింటిదాని బాధొకటి పట్టుకున్నది! ఫస్టు తారీఖున రెండు పెద్ద కాసులూ చేతులో పెట్టకపోతే చెప్పుదెబ్బలు తప్పవు! ఆ రాత్రి దాని కంటపడడం చేత ఆవిధంగా రాజీ చేసుకోక తప్పిందికాదు. ఎవరో వచ్చుచున్నారు! (అని లేచి గంభీరముగా గూరుచుండును.)

ఒక టీచరు :- (చేతులు కట్టుకొని ప్రవేశించి, నమస్కరించి) అయ్యా! నేను అచ్చన్న పేట స్కూలు తాలూకు అయిదో టీచర్నండి.

వెంగ :- అయితే యేమంటావు? ఆ నంగినంగి వేషా లేమిటి?

టీచ :- వల్లూరులో నా భార్య కనలేక మూణ్నాళ్ళనుంచి కష్టపడుతూ ఉన్నదండి. రెండు రోజులు సెలవిప్పించితే వెళ్ళివస్తానండి.

వెంగ :- నీభార్య కష్టపడుతూ వుంటే నీ వెందుకు యేడవనూ? నీవు కనిపిస్తావా? లేక వకాల్తానామా పుచ్చుకొని నీవే కంటావా?

టీచ :- డాక్టరు దొరసానిగార్ని తీసుకువెళతానండి.

వెంగ:-అబ్బో! నీ మొహాని కదికూడానా! యినస్పెక్టరుగార్ని చూచావా?

టీచ :- చూచానండి. చూస్తే తమతో మనవి చేసుకోమన్నారు.

వెంగ :- అయితే ఆ పిడతను ముందుచూచి ఆ పిడత వెళ్ళమంటే అప్పుడు వచ్చావన్నమాట. ఫో! సెలవూ లేదూ గిలవూ లేదు ఫో!

టీచ :- (దైన్యముతో) అయ్యా! కటాక్షించాలి. కష్ట సమయం.

వెంగ :- పొమ్మంటే పొయ్యావు కావు గనుక రెండురూపాయలు ఫైను.