సప్తమాంకము
మొదటి రంగము
(ప్రదేశము: లింగరాజుగారి పడక గది.)
(ప్రవేశము: కుక్కి మంచముపైఁ గూర్చుండి లింగరాజుగారు, చేరువను నిలుచుండి సుభద్ర.)
సుభ :- సరేగాని, నలుగురు నట్టింటికి వచ్చునప్పుడైన నా నగలు నాకీయఁగూడదా? ఇంట శుభకార్య మగునప్పుడు గూడ నేనిట్లు యుండవలయునా?
లింగ :- ఎందులకే యింత తొందర? ఎల్లుండి రాత్రికి గదా వివాహము? అకారణముగా నీ రెండు దినములు నఱిగిపోవుటయే గదా?
సుభ :- అబ్బబ్బ! యెప్పుడు చూచిన నగ తఱిగిపోవుననియు, బట్టలు చిఱిగిపోవుననియు, బియ్యము తఱిగిపోవుననియు నిదే గోల కద! ఎందులకీ భాగ్యమంతయు?
గీ. స్వారిచేయని గుఱ్ఱంబు, చదువనట్టి
పుస్తకంబును, సేవింపఁబోని మందు,
నారగింపని వంటక, మనుభవింప
నట్టి ధనమును వ్యర్థంబు లనుట వినరె?
లింగ :- ఓసీ! యెందుల కేడిపించెదవు? రేపిచ్చెద యూరకుండుము.
సుభ :- రేపు శుక్రవారమని సున్న చుట్టుటకా?
లిం :- నేడు గురువారము, గురువారము బొత్తిగా గూఁడనిది.
సుభ :- ఈ వన్నెవారిఁకఁ గోడలి కేమి నగలు పెట్టుదురు?
లింగ :- ఇక్కడికి నీ సంగతి యైనది? ఇఁకఁ గోడలి సంగ