పుట:Varavikrayamu -1921.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

వరవిక్రయము

పురు :- మా యిష్టము కొరకుఁ జూడవలదు. నీ యిష్టమే మా యిష్టము. నిశ్చయముగా నీ యిష్ట ప్రకారము జరిగింతుము.

కమ :- (కొంచెమాలోచించి) ఈ వివాహమునకు సంబంధించిన యితర విషయములలోఁ గూడ నా యిష్టానుసారముగా నడువనిత్తురా?

పురు :- సందేహ మేమీ. సర్వత్రా నీ యిష్టమే మా యిష్టము. ఈ మాటకు నే నిసుమంతయు దప్పిపోవువాఁడను గాను.

కమ :- అట్లయిన నా కంగీకారమే!

భ్రమ :- (తలనిమురుచు) అమ్మా! ఆనక మా గొంతుక కోయక ఆలోచించిఁ మఱిచెప్పుము!

కమ :- ఆలోచించియే చెప్పినాను. అనుమాన మక్కఱలేదు.

పేర :- సెబాసు తల్లీ! నా మనస్సుకిప్పుడు నచ్చావు! సమయానికి లేకపోయింది. కాని వుంటే, వుద్ధరిణెడు పంచదార నోట్లో పోస్తును.

పురు :- పేరయ్యగారూ! పెడయాలోచనము లింక నెందులకు? సాయంకాలము మీరు వెళ్లి సంగతి యాయనతోఁ జెప్పి, సరే యనిపించుకొని రండు. (మెల్లగా) ఇంకొకటి కార్య మీ నెలలోనేకావలెను. యేమనెదరా? యీవిడగారీ సందడిలోఁబడి ఇప్పటి వ్యసనమును గొంతయిన మఱచిపోగలదు.

పేర :- బాగుంది బాబూ! బాగుంది. శలవు పుచ్చుకొనివెళ్ళి శెటిల్‌ చేసుకొని చక్కావస్తాను. అమ్మా! శలవు. (అని నిష్క్రమించును.)

పురు :- (లేచి కమలనెత్తి యక్కునఁ జేర్చుకొని) తల్లీ!

ఆ. ఏండ్ల కన్నఁ జాల హెచ్చగు బుద్ధి నీ
    కిచ్చి మమ్ముఁ దేల్చె నీశ్వరుండు!
    అక్క యట్లు చేసినందుల కీపైన
    మాకు కనుల యెదుట మనఁగదమ్మ!

కమ :- (కొంచె మీవలకు వచ్చి తనలో)

ఉ. అక్కరొ! నీ మతంబునకు నడ్డముగాఁ జనుచున్న నా యెడన్‌
    మక్కున వీడబోకు! మభిమానము లేనికతాన గాదు నే
    నిక్కరణిం భ్రమించుట మఱేమన దేవుఁడు మధ్యవర్తిగా
    నిక్కము దెల్పుచుంటి నిటు నీ కసి తీర్ప మదిం దలంచితిన్‌.

ఇది షష్ఠాంకము.

(తెరపడును.)


★ ★ ★